ఇందిరా గాంధీ కాళ్లకు గజ్జెలు కట్టా..

29 Jan, 2021 13:46 IST|Sakshi

నెమలి పురివిప్పి నాట్యమాడితే అడవి పరవశిస్తుంది.. కానీ, ఆ కళాకారుడు గుస్సాడీ నృత్యం చేస్తే అడవే పాదం కలుపుతుంది.. ఆయన గాగ్ర కాళ్లగజ్జెలు కట్టి ఆడితే చెట్టూ, పుట్టా, కొండ, కోన ప్రతిధ్వనిస్తుంది.. ఆయన నృత్యప్రకంపనలు క్రమేణా అడవిని దాటి దేశ రాజధానిని తాకాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా గాగ్ర గజ్జెలతో గుస్సాడీలో కాలు కదిపారు. ఆయన కళాప్రదర్శనకు 2002లో అప్పటి రాష్ట్రపతి కలాం కూడా సలాం చేశారు. కళలోనే కళాకారుల జీవితం నిమగ్నమై ఉంటుందని నిరూపించిన కనకరాజుకు దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ వరించింది. ఈ పురస్కారం పొందిన మొదటి తెలంగాణ ఆదివాసీ కళాకారుడిగా గుస్సాడీ కనకరాజు నిలిచారు. ఈ సందర్భంగా ఎనభై ఏళ్లు దాటిన పద్మశ్రీ కనకరాజు ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆయన ఆలోచనలు, అనుభవాలు తన మాటల్లోనే...     -సాక్షి, హైదరాబాద్‌

దండారి నృత్యమే స్ఫూర్తి... 
ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మర్లవాయి మా సొంత ఊరు. మేం అడవితల్లి బిడ్డలం. నా చిన్నతనంలో దండారి నృత్యం చూసి స్ఫూర్తిపొందాను. నాకంటూ ఏ గురువూ లేడు. నేను చేసే గుస్సాడీ నృత్యం దండారిలోంచి వచ్చిందే. కళలో లీనమైన నన్ను చాలామంది గుస్సాడీగానే పిలిచేవారు. వారసత్వసంపద నుంచి నేర్చుకున్న కళ నాకు సంతృప్తినే కాకుండా మా ఆదివాసీలందరికీ గుర్తింపునిచ్చింది.  

కలాం ముందు ప్రదర్శనలు ఇచ్చా..
పద్మశ్రీ లాంటి అవార్డు తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో ఉండే ఆదివాసీ కళాకారులకు వస్తుందని నేను ఊహించలేదు. 1955 నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. 1982లో దేశ రాజధానిలో నిర్వహించిన పరేడ్‌లో అప్పటి ప్రధాని ఇందిర కాళ్లకు మా సంప్రదాయ గాగ్ర గజ్జెలు కట్టాను. ఆమె కూడా మాతోపాటు పాదం కలిపారు. 2002లో రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ముందు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించాను. ఇప్పటివరకు దాదాపు 300 మంది కళాకారులకు గుస్సాడీ నృత్యాన్ని నేర్పాను. ఈ తరం వారికి నేర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడితే సహకారమందించడానికి నేను సిద్ధం.  (చదవండి: మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ)

వ్యవసాయమే బతుకుదెరువు.
మాది గోండు సూర్యవంశం. గుస్సాడీ నృత్యం నా ఊపిరి. కానీ, ఇది మా బతుకుదెరువు కాదు. వ్యవసాయమే ఆధారం. ఎనిమిది మంది కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వ్యవసాయంతోనే కుటుంబాన్ని పోషించాను. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరింత దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నాను.  


ఇందిరా గాంధీతో కనకరాజు (వృత్తంలో)

వైభవోత్సవమైన సంప్రదాయాలు  
మా సంస్కృతే మా పండుగ. దసరా, దీపావళి మధ్యలో నిర్వహించే భోగిలో గుస్సాడీ నృత్యం ప్రారంభమవుతుంది. గుస్సాడీలో ప్రత్యేక వేషధారణ ఉంటుంది. చేతిలో దండారి, తలపై మల్జాలిన టోíపీ, (మలి అంటే నెమలి, జాలి అంటే ఈకలు అని అర్థం) గాగ్ర కాలిగజ్జెలు, మెడలో నైపాల్క్‌ హారం, జోరి, గంగారం సోట, జంతువుల చర్మంతో చేసిన వస్త్రాలు, డప్పులు ఉంటాయి. మల్జాలిన టోíపీ పెట్టుకున్న వ్యక్తి ఆదివాసీల దైవం మస్మసూర్‌తో సమానం అని మా ప్రగాఢ నమ్మకం.  

మరిన్ని వార్తలు