మనుగడ కోసం రాబంధుల పోరాటం!.. అంతరించిపోయే దశలో ప్రకృతి నేస్తాలు

17 Dec, 2022 20:52 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: జీవ వైవిధ్యం దెబ్బతింటుండటంతో పర్యావరణ పరిరక్షణలో తోడ్పడే రాబంధులు ప్రస్తుతం రాష్ట్రంలో మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. పూర్వం గ్రామాల్లో ఏదైనా పశువు చనిపోతే గుంపులుగా కనిపించేవి. జీవుల కళేబరాన్ని తిని ప్రకృతి నేస్తాలుగా పర్యావరణ రక్షణకు తోడ్పడేవి. అయితే మానవాళి ప్రకృతి విధ్వంసక చర్యలతో అవి పదుల సంఖ్యకు పడిపోయాయి. గ్రామాల్లో పశువుల సహజ మరణాలు తగ్గిపోయాయి. అవి చనిపోయే వరకు ఆగకుండా ముందే వధశాలలకు తరలిస్తున్నారు. దీంతో రాబంధులకు తిండి దొరక్క చివరకు అటవీ ప్రాంతాలకే పరిమితమయ్యా­యి.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు కనిపించడం తగ్గిపోయిన రాబంధులు చాలా కాలం తర్వాత 2013లో తొలిసారిగా కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలం నందిగామ శివారులో కనిపించాయి. పెద్దవాగు, ప్రాణహిత నది కలిసే పాలరాపు గుట్టపై గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇందులో 20 పెద్దవి, మరో పది వరకు చిన్నవి ఉన్నట్లు గుర్తించారు. కాగా, పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ డివిజన్‌ కమలాపూర్‌ రేంజ్‌ చల్వడాతోపాటు మరో నాలుగు చోట్ల కూడా 60 నుంచి 70 వరకు రాబంధులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.

ఇందులో పొడుగు ముక్కు (గిప్స్‌ ఇండికస్‌), ఓరియంటల్‌ వైట్‌ బ్లాక్, స్లెండర్‌ బిల్డ్‌ జాతులు ఉన్నట్లు చెపుతున్నారు. కాగా, పొడుగు ముక్కు రాబంధులు ప్రాణహిత తీరంలో సంచరిస్తున్నాయి. రోజుకు వంద కిలోమీటర్లు సులువుగా తిరిగే ఈ పక్షులు నదికి ఇరువైపుల స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. ఇదిలా ఉండగా చాలా కాలానికి నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు పరిసరాల్లోని కృష్ణానది తీరంలో కూడా కొన్ని రాబంధులు కనిపించినట్లు అటవీ అధికారులు చెపుతున్నారు. 

దెబ్బతీసిన డైక్లోఫినాక్‌..  
గతంలో పశువుల్లో వ్యాధుల నివారణ కోసం డైక్లోఫినాక్‌ మందును ఎక్కువగా ఉపయోగించేవారు. దీంతో పశువుల కబేళరాలను తిన్న రాబంధులకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటి మూత్రపిండాలు, పునరుత్పత్తిపై ఈ మందు ప్రభావం చూపడంతో రాబంధుల జాతి అంతరించేందుకు ఇది ప్రధాన కారణమైంది. 2006­లో ఈ మందును కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే అప్పటికే 9 రాబంధు జాతుల్లో దేశంలో నాలుగు జాతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2002లో ఇంటర్నేషనల్‌ యూ­ని­యన్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీ­ఎన్‌) అనే అంతర్జాతీయ పర్యావరణ సంస్థ రాబంధులను అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల సెల్‌ టవర్లు, విద్యుత్‌ తీగలకు తాకి ఇవి చనిపోయినట్లు గుర్తించారు.  

పర్యావరణంలో ప్రముఖ పాత్ర 
రాబంధులు పర్యావరణ పరిరక్షణలో ప్రకృతి నేస్తాలుగా ఉంటాయి. మృతిచెందిన జీవ వ్యర్థాలను ఇవి ఆహారంగా తీసుకుని.. ఆంత్రా­క్స్, రేబిస్, ట్యూబర్‌క్యులోసిస్‌ వంటి ప్రమాదకర రోగాలు ప్రబలకుండా కాపాడతాయి. అలా­గే కళేబరాలను మట్టిలో కలిసిపోయేలా తోడ్పడతాయి. రాబంధులు ఉండే ప్రాంతాన్ని జీవ వైవిధ్యతకు చిహ్నంగా పర్యావరణ వేత్తలు చెపుతుంటారు. 

అటవీ శాఖ సంరక్షణ చర్యలు 
ప్రాణహిత తీరంలో రాబంధుల సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి స్థిరంగా ఉండలేకపోతున్నాయి. ఆ ప్రాంతంలో వేటను నిషేధించారు. అలాగే మనుషుల సంచారాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట ఈ ప్రాంతంలో గుట్టపై ఆరోగ్యకరమైన పశువు మాంసాన్ని ఆహారంగా వేశారు. అయితే అవి తినేందుకు ఇష్టపడలేదు. వానాకాలంలో గుట్టపై గూళ్లు దెబ్బతినడంతో మళ్లీ మహారాష్ట్రకు వైపు వెళ్లాయి. ఇటీవల కొన్ని తిరిగివచ్చాయి.

సహజ ఆహార వేట అలవాటుతో అవి అధికారులు వేసిన ఆహారాన్ని ఇష్టపడక పలు చోట్ల సంచరిస్తున్నాయి. రాబంధులు సంచరిస్తున్న ఈ ప్రాంతాన్ని నాలుగేళ్ల క్రితమే ‘జఠాయువు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’గా ప్రకటించాలని అటవీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో అంతరించి పోయే దశలో ఉన్న రాబంధుల సంతతి పెరగకపోతే పర్యావరణానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు