Uppal Elevated Corridor: బాబోయ్‌..ఇదేం రోడ్డు? వెళ్లాలంటే దడ పుడుతోంది!

5 Oct, 2021 07:52 IST|Sakshi

సాక్షి, ఉప్పల్‌:  ఉప్పల్‌ నుంచి నారపల్లికి వయా ఉప్పల్‌ డిపో మీదుగా రోడ్డు ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. గుంతలమయమైన రోడ్లు..దుమ్ము ధూళితో కళ్లల్లో మంటలు, తరుచుగా ప్రమాదాలతో ఈ రహదారి టెర్రర్‌గా మారింది. వరంగల్‌ జాతీయ రహదారి కూడా అయిన ఈ మార్గంలో 2018 జులైలో...రూ.717 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 130 పిల్లర్లు మాత్రమే నిర్మించారు.
చదవండి: Hyderabad: వాళ్ల కష్టాలు తీరనున్నాయి.. ఆ ప్రాంతానికి మహర్దశ

2020 జూన్‌లోనే ఫ్లైఓవర్‌ మొత్తం పనులు పూర్తవ్వాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఇప్పటికి కేవలం 35 శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీంతో 6.2 కిలోమీటర్ల మేర ఇరువైపులా రహదారి ప్రమాదభరితంగా మారింది. ఇటీవలి వర్షాలకు పరిస్థితి మరీ దిగజారింది. ఏదైనా భారీ వాహనం వెళ్తుంటే..దాని వెనుక వెళ్లే వాహనదారులకు అసలు రోడ్డే కన్పించడం లేదు. అంతగా దుమ్ము..ధూళితో పొగ కమ్ముకుంటోంది. యాదాద్రి వెళ్లాలన్నా, భువనగిరి, వరంగల్, భూపాలపట్నం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది మంది నరక యాతన అనుభవిస్తున్నారు. 
చదవండి: మొక్కల కన్నా ముస్లింలు హీనమా?


ఉప్పల్‌ చెరువు కట్ట మీద దుమ్ముకొట్టుకు పోతున్న వరంగల్‌ జాతీయ రహదారి  

లేని రోగాలు వస్తాయి.. 
బీబీనగర్‌లో వెంచర్‌ నడుస్తున్నందున నేను ప్రతి రోజు ఉప్పల్‌ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కారు డోరు వేసుకున్నా దుమ్ము వదలడం లేదు. దీంతో దగ్గు వస్తోంది. జబ్బు చేసినట్లుగా ఉంటోంది. వీటికి తోడు పెద్ద పెద్ద గుంతల కారణంగా వాహనాలు పాడవుతున్నాయి. ఈ తిప్పలు ఎన్నాళ్లుంటాయో ఏమో మరి. 
– మేకల దయాసాగర్‌ రెడ్డి, వ్యాపారి, ఉప్పల్‌ 

గుంతలు..మట్టికుప్పలుబాబోయ్‌..ఇదేం రోడ్డు? 
ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు వెళ్లాలంటేనే దడ పుడుతోంది. ఎక్కడ చూసినా గుంతలు..మట్టికుప్పలు..దుమ్ము ధూళితో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఎవ్వరికి ఫిర్యాదు చేసినా తమ పరిధి కానే కాదంటున్నారు. 
 – పూస అశోక్‌ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

మరిన్ని వార్తలు