Hyderabad: భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌..

2 Sep, 2021 23:15 IST|Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం పలుచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. అమీర్‌పేట్‌, మైత్రీవనం, ఎస్‌ఆర్ నగర్‌లో దాదాపు గంట పాటు వర్షం దంచికొట్టింది. దీంతో, పంజాగుట్ట నుంచి కూకట్‌ పల్లి మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌లో కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రోడ్లన్ని ఎక్కడికక్కడ జలమయమయ్యాయి.

మ్యాన్‌ హోల్‌లు పొంగిపోర్లుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలతో రోడ్లన్ని రద్దీగా మారాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  కాగా, ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు ఆగకుండా చర్యలు చేపట్టారు.  కాగా మరో గంటపాటు జంటనగరాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. టోలీచౌకిలో పలు కాలనీలు నీటమునిగాయి. రంగంలోకి జీహెచ్‌ఎమ్‌సీ డిజాస్టర్‌, మాన్‌సూన్‌ బృందాలు రంగంలోకి దిగాయి. జూబ్లీహిల్స్‌లో 10 సెం.మీ, ముసాపేట 9.6 సెం.మీ, మాదాపూర్‌ 8.7 సెం.మీ, సరూర్‌ నగర్‌ 8 సెం.మీ, యూసుఫ్‌గూడ 7.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

చదవండి: తప్పిన ప్రమాదం.. రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు

మరిన్ని వార్తలు