మూసీకి పోటెత్తిన వ‌ర‌ద‌..మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

5 Sep, 2023 21:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ నల్గొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇక రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో కురిసిన కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్భందంలో ఇరుక్కుపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి.

ఉధృతంగా మూసీ.. మూసారాంబాగ్‌ బ్రిడ్జి మూసివేత
హైదరాబాద్‌లో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు మూసీలో వదలడంతో మూసారాంబాగ్‌ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మూసీ వాగు ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జికి ఆనుకొని వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మంగళవారం రాత్రి 9గంటల నుంచి మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తెలిపారు.

మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురుస్తుండడంతో  నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి 3250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుద‌ల చేశారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు.  ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో :1013.18 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్ ఫ్లో : 3753.81క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం : 645.00 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం : 643.60 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 4.46టీఎంసీలు..కాగా ప్రస్తుత నీటి నిల్వ  : 4.09టీఎంసీలు ఉంది.
చదవండి: మైసమ్మగూడలో నీట మునిగిన అపార్ట్‌మెంట్లు

జంట జలాశయాలకు భారీగా వరద నీరు
హైద‌రాబాద్ జంట జ‌లాశ‌యాలైన ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ ప్రాజెక్టుల‌కు కూడా వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. ఈ క్ర‌మంలో హిమాయ‌త్ సాగ‌ర్ ప్రాజెక్టు 4 గేట్లు, ఉస్మాన్ సాగ‌ర్ 2 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేశారు. దీంతో మూసీకి వ‌ర‌ద పోటెత్తింది. మూసీ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌ను కూడా అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు.

బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్ప‌పీడనం ఏర్ప‌డిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. అల్పపీడ‌న ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

మరిన్ని వార్తలు