నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న హెటిరో

6 Oct, 2020 02:44 IST|Sakshi
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌లకు రూ. 5 కోట్ల చెక్కును అందిస్తున్న హెటిరో చైర్మన్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌/జిన్నారం (పటాన్‌చెరు): ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్‌ సంస్థ సామాజిక బాధ్యతలో మరో ముందడుగు వేసింది. టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ స్ఫూర్తితో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్‌–నల్లవెల్లిలో విస్తరించిన 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని హెటిరో డ్రగ్స్‌ సోమవారం దత్తత తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5 కోట్ల చెక్కును హెటిరో చైర్మన్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి ప్రభుత్వానికి అందించారు. ఈ సందర్భంగా అక్కడ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు సమీపంలోని నర్సాపూర్‌ అడవిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. ఆ మేరకు అడవులను రక్షించేలా ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు.  

రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు భేష్‌.. 
తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గొప్పగా ఉన్నాయని హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ పార్థసారథిరెడ్డి ప్రశంసించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ పేరుతో ఎంపీ సంతోష్‌ కృషి తమను ఆకర్షించిందని, అందుకే సామాజిక బాధ్యతగా అడవిని దత్తత తీసుకుని అభివృద్దికి సంకల్పించినట్టు తెలిపారు. హెటిరో డ్రగ్స్‌ చొరవను సంతోష్‌ ఈ సందర్భంగా అభినందించారు. వీరి దారిలోనే మరికొందరు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పర్యావరణ పరిరక్షణకు ముందుకు వస్తున్నారని వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అటవీశాఖ ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలను గురించి హెటిరో ప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. 

మంబాపూర్‌ అటవీ ప్రాంతం ప్రాధాన్యత 
మంబాపూర్‌ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు అభివృద్ధి చేయనున్నారు. అలాగే మొత్తం 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని స్థిరీకరించటం, ఆక్రమణలకు గురికాకుండా 25 కి.మీ. పరిధిలో అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్‌ వేయటం, రక్షిత అటవీ ప్రాంతంలోకి మానవ, పెంపుడు జంతువుల ప్రవేశాన్ని నియంత్రించటం ద్వారా సహజ అడవి పునరుద్ధరణను హెటిరో నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌తో పాటు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ విస్తరిస్తున్న టౌన్‌షిప్‌లకు ఈ అడవి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే లంగ్‌ స్పేస్‌గా ఉపయోగపడనుంది. నర్సాపూర్‌ రోడ్డు నుంచి అడవిలో ప్రవేశించిన తర్వాత 2 కి.మీ. దూరంలో చుక్కగుట్ట కొండ ప్రాంతంలో (సుమారు 630 మీటర్ల ఎత్తు) వ్యూ పాయింట్‌ ఏర్పాటు, ఎకో ట్రెక్కింగ్, విద్యార్థులకు పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.మహిపాల్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ శాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతకుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, పీసీసీఎఫ్‌ (సోషల్‌ ఫారెస్ట్రీ) ఆర్‌.ఎం.డోబ్రియల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు