సందేహాలు తీరేదెలా?

28 Aug, 2020 03:19 IST|Sakshi

ఒకే ఇంట్లో ముగ్గురు విద్యార్థులుంటే ఒకేసారి ఎలా వినాలి?

గిరిజన ప్రాంతాల్లోని వారికి ఎలా న్యాయం చేస్తారు?

టీవీ కూడా లేనివారు టీశాట్‌ క్లాసులు ఎక్కడ వినాలి?

ఆన్‌లైన్‌ క్లాసులకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనా?

పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఎలా చూస్తారు?

టీశాట్‌ క్లాసుల నిర్వహణపై హైకోర్టు సందేహాలు

విచారణ 18కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ‘మెజారిటీ విద్యార్థులు గణి తంలో కొద్దిగా వీక్‌గా ఉంటారు. టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తరగతులు బోధిస్తామంటున్నారు. మరి విద్యార్థులకు వచ్చే సందేహాలను ఎలా నివృత్తి చేస్తారు?’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించడాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. సెప్టెం బర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులకు తరగతులు బోధించాలని నిర్ణయించామని, గురువారం (ఈనెల 27) నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరుకావా లని ప్రభుత్వం ఆదేశించిందని స్పెషల్‌ జీపీ సంజీవ్‌ కుమార్‌ నివేదించారు. టీశాట్‌ ద్వారా 1–5వ తరగతి మధ్య విద్యార్థులకు 90 నిమిషాల పాటు, 6–8వ తరగతి మధ్య విద్యార్థులకు 2 గంటలపాటు, 9–10వ తరగతి విద్యార్థులకు 3 గంటలపాటు ఆన్‌లైన్‌ పాఠాలు ఉంటాయని,  శని, ఆదివారాలు సెలవులు ఉంటాయని తెలిపారు. టీవీ అందుబాటులో లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీ, సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీవీలో పాఠాలు వినే ఏర్పాటు చేశామని, ప్రతి విద్యార్థి పాఠాలు విలేనా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటారని వివరించారు.

‘ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు తప్పనిసరా? హాజరుకాకపోతే ఎటువంటి పరిణామాలుంటాయి? ఒకే ఇంట్లో 5వ, 8వ, 11వ తరగతి చదివే ముగ్గురు విద్యార్థులుంటే వారు టీశాట్‌లో ఒకేసారి తరగతులు ఎలా వినాలి? ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో లేని ఆదిలాబాద్, ములుగు వంటి గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు తరగతులు ఎలా బోధిస్తారు? పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా ఏం చర్యలు తీసుకుంటారు? ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు సంబంధించి మీరు చెబుతున్నది ఆచరణ సాధ్యమేనా?’అంటూ ధర్మాసనం పలు సందేహాలు వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశిస్తే వేరు వేరు సమయాల్లో తరగతులు నిర్వహిస్తామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని సంజీవ్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. విద్యార్థులను ఇళ్లలో ఖాళీగా ఉంచకుండా ఆన్‌లైన్‌ క్లాసుల రూపంలో వారిని బిజీగా ఉంచేందుకే క్లాసులు నిర్వహిస్తున్నామని సీబీఎస్‌ఈ తరఫు న్యాయవాది ఛాయాదేవి నివేదించారు. 9–12 తరగతులకు సిలబస్‌ తగ్గిస్తామని, తగ్గించిన సిలబస్‌ నుంచే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చేలా చూస్తామని వివరించారు.  (తెరుచుకున్న బడులు )

ఎన్ని పాఠశాలలకు చర్యలు తీసుకున్నారు?
ఫీజుల కోసం వేధించరాదన్న ప్రభుత్వ జీవో 46కు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వై.షీలు నివేదించారు. ఆన్‌ లైన్‌ క్లాసులకు హాజరుకాకపోయినా, ఫీజులు కట్టని వారి అడ్మిషన్లు రద్దు చేశారని తెలిపారు. ఫీజుల వసూలుకు సంబంధించి అనేక పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై ఆయా పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని, వారిచ్చే వివరణ ఆధారంగా పాఠశాల గుర్తింపు రద్దు చేయడం లాంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సంజీవ్‌కుమార్‌ అన్నారు. ‘ఎన్ని పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాయి ? ఎన్ని పాఠశాలలకు నోటీసులు జారీచేశారు ? ఎన్ని పాఠశాలలు వివరణ ఇచ్చాయి ? ఆయా స్కూళ్ల వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఏం చర్యలు తీసుకున్నారు ?’తదుపరి విచారణ 18వ తేదీలోగా పూర్తి వివరాలు సమర్పించండి అని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఆన్‌ లైన్‌ క్లాసుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకొని ఉంటే బాగుండేదని స్పష్టం చేసింది. ఆన్‌ లైన్‌ క్లాసులు నిర్వహించాలంటూ సీబీఎస్‌ఈ బోర్డు ఇచ్చిన సర్క్యులర్‌ చట్టబద్ధం కాదని న్యాయవాది వై.షీలు వివరించారు. అయితే ఆ సర్క్యులర్‌ను కొట్టివేయాలంటూ పిటిషన్‌ లో మార్పులు చేయాలని, అప్పుడు ఆ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం సూచించింది. 

పేరెంట్స్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులా ?
ఫీజులు వసూలు చేయడాన్ని ప్రశ్నించేందుకు పాఠశాలకు వెళ్లిన పేరెంట్స్‌పై బోయిన్‌ పల్లి పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు ఎలా నమోదు చేస్తారని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఎందుకు వారిపై కేసులు నమోదు చేయాల్సి వచ్చిందో తదుపరి విచారణ నాటికి వివరణ ఇవ్వాలని ఏజీని ఆదేశించింది. 

ఏపీలో సక్సెస్‌....
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 30 రోజులుగా దూరదర్శన్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా ఆన్‌ లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారని, అదే తరహాలో ఇక్కడా నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని న్యాయవాది సంజీవ్‌కుమార్‌ నివేదించారు. జీరో విద్యా సంవత్సరం కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆన్‌ లైన్‌ తరగతులు వినని వారికి వర్క్‌షీట్స్‌ ఇస్తామని, వీటిని పూర్తి చేసేలా ఉపాధ్యాయులు చూస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్తారని, వారికున్న సందేహాలను నివృత్తి చేస్తారని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు