స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!

28 Aug, 2020 03:14 IST|Sakshi

ప్రధాని మోదీ విశ్వాసం

న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ విధానం దేశ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుందని, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తే, ప్రపంచంలో భారత్‌ స్థాయి పెరుగుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచశాంతి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సుస్థిరంగా ఉండేందుకు ఇది సాయపడుతుందని పేర్కొన్నారు. రక్షణరంగ పరిశ్రమల సదస్సునుద్దేశించి గురువారం ప్రధాని ప్రసంగించారు.

రక్షణ సామర్థ్యాల్లో స్వావలంబన సాధించడం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతం రక్షణ కల్పనలో భారత్‌ పాత్ర పెరుగుతుందన్నారు. వ్యూహాత్మక సంబంధాలను బట్టి పలు మిత్ర దేశాలకు రక్షణ సరఫరాదారుగా కూడా మారుతుందని తెలిపారు. ‘ప్రపంచదేశాల్లో భారత్‌ అతిపెద్ద రక్షణ వస్తువుల దిగుమతిదారుగా ఉంది. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు గతంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

రక్షణ పరికరాల దిగుమతులపై విధించిన నిషేధంతో దిగుమతులకు అడ్డుకట్ట పడటంతోపాటు దేశీయ పరిశ్రమ బలోపేతం అవుతుంది. నిషేధం జాబితాలో మరిన్ని వస్తువులను కూడా త్వరలో చేరుస్తాం’అని తెలిపారు. నూతన విధానంతో దేశీయ ఉత్పత్తి పెరగడంతోపాటు ప్రైవేట్‌ రంగం సాయంతో సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆటోమేటిక్‌ విధానంలో రక్షణ రంగంలోకి 75 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలకు ఉభయతారకంగా పనిచేస్తుందని వివరించారు.

ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమల కారిడార్‌ ఏర్పాటు దిశగా చర్యలు  సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇందుకుగాను ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వ్యయం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ.. దేశీయ సాంకేతికత, సామగ్రిని ఉపయోగించుకుని యుద్ధంలో పోరాడి, విజయం సాధించడానికి మించిన సంతృప్తి మన జవాన్లకు మరేదీ లేదన్నారు. తరువాతి తరం సైనిక సంపత్తి అభివృద్ధిలో దేశీయ పరిశ్రమతో కలిసి ముందుకు సాగుతామన్నారు. 

మరిన్ని వార్తలు