గుట్టలు గుల్ల.. సర్కారు లీజు గోరంత.. తవ్వుకునేది గుట్టంతా

9 Dec, 2022 04:14 IST|Sakshi

పెద్దల కనుసన్నల్లో కొనసాగుతున్న గ‘లీజు’దందా 

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి 

నిజామాబాద్‌ జిల్లా బట్టాపూర్‌ కొండ దాదాపు కనుమరుగు 

అనుమతి 13,686 క్యూబిక్‌ మీటర్లకు.. తొలచింది 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు 

ఓ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో ఇష్టారాజ్యం 

రూ.51.15 లక్షల విద్యుత్‌ బకాయిల వసూలుకు సాహసించని అధికారులు 

ఇతర మైనింగ్‌ ప్రాంతాల్లోనూ యథేచ్ఛగా కొండలు పిండి 

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
‘‘కొండలు పగలేసినం..బండలనూ పిండినం.. మా పదవులు అడ్డుపెట్టి ఉన్నకాడికి ఊడ్చుతం’’.. ఇదేంటీ యాభై ఏళ్ల క్రితం విప్లవ కవి చెరబండ రాజు అప్పటి దోపిడీ పీడనపై ఎక్కుపెట్టిన ‘కొండలు పగిలేసినం..’’అన్న కవితకు పూర్తి వ్యతిరేకంగా ఉంది అనుకుంటున్నారా? అవును..వ్యతిరేకమే..ఇప్పుడిలాగే ఉంది పరిస్థితి. అక్రమాలు సాగించే వారికి పదవుల్లో ఉన్నవారి అండా దండా తోడైతే ఇంక అడ్డేముంది?

అందినకాడికి మనదే..అన్నట్టుగా కళ్ల ముందే కొండలన్నీ పిండి చేస్తున్నారు. సర్కారుకు కొసరంత సీనరేజీ కట్టి..కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో భూగర్భ వనరుల శాఖ కొండలు, గుట్టలను పలు సంస్థలకు లీజుకు ఇస్తుంటుంది. ఆయా సంస్థల నుంచి సీనరేజీ వసూలు చేస్తుంది. అయితే కొండ/గుట్టలో కొంత భాగం లీజుకు తీసుకుంటున్న అక్రమార్కులు మొత్తం కొండంతా తవ్వేస్తున్నారు.

అధికారులెవరైనా ప్రశ్నిస్తే నయానో, భయానో వారిని చెప్పుచేతల్లో పెట్టుకుని మైనింగ్‌ జోన్‌ సహా, ఇతర ప్రాంతాల్లోనూ దందా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల్లో అడ్డూఅదుపూ లేని క్రషింగ్‌తో కొండలు కనుమరుగవుతున్నా, భారీయెత్తున సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. 

వాస్తవ లీజును మించి పదింతల మైనింగ్‌! 
నిజామాబాద్‌ జిల్లాలో గుట్టల్ని మింగే ‘అనకొండలు’ బట్టాపూర్‌ కొండను ఆనవాళ్లే లేకుండా మింగేస్తున్నాయి. తీసుకున్న లీజును మించి పదింతల మైనింగ్, క్రషింగ్‌ చేస్తూ ఎవరడ్డొచ్చినా తగ్గేదేలేదంటున్నారు. ఈ జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న బట్టాపూర్‌ కొండ క్రషింగ్‌ వివరాల్లోకి వెళితే.. ఏర్గట్ల మండలం బట్టాపూర్‌ సర్వేనంబర్‌ 195/1లో 3.85 హెక్టార్లను 2016లో లీజుకు తీసుకున్నారు.

కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుండి అనుమతి (కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌) లేకుండానే గుట్టను తొలిచి క్రషింగ్‌ మొదలుపెట్టారు. ఇప్పటివరకు 13,686 క్యూబిక్‌ మీటర్ల మేరకే భూగర్భ శాఖ నుండి అనుమతి తీసుకుని సుమారు రూ.6.36 లక్షల సీనరేజీని చెల్లించారు. కానీ వాస్తవంగా సుమారు 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర కొండను తొలిచి కంకరగా మార్చి కోట్లలో సొమ్ము చేసుకున్నారు.

జియో ట్యాగింగ్‌ ద్వారా ఫిట్‌ మెజర్‌మెంట్‌ పద్ధతిలో బట్టాపూర్‌ క్వారీలో పరిమితికి మించి తవ్వకం జరిగినట్లు అధికార యంత్రాంగం గుర్తించినా..దీని వెనక ఉన్న ముఖ్యనేత హెచ్చరికతో ఆ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదు. ఈ క్వారీలో పరిమితికి మించిన పేలుళ్ల కారణంగా బండరాళ్లు పంటపొలాల్లో, పక్కనే ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పడుతున్నాయన్న ఫిర్యాదుతో.. ఓ మారు తనిఖీకి వచ్చిన కమ్మర్‌పల్లి ఎఫ్‌ఆర్‌వో ఆనంద్‌రెడ్డిని 24 గంటల్లోనే బదిలీ చేయించడంతో, ఇక ఏ ప్రభుత్వ శాఖ అధికారీ ఆ విషయం పట్టించుకోవడం లేదు.

సామాన్యులు బకాయి పడితే వారం రోజులు కూడా ఉపేక్షించని విద్యుత్‌ అధికారులు.. ఈ వీవీఐపీ ఫిబ్రవరి, 2022 నుండి విద్యుత్‌ బిల్లు చెల్లించకపోయినా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు సంబంధిత సంస్థ ఎన్‌పీడీసీఎల్‌కు రూ.51.15 లక్షల విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా..ఆ వైపు వెళ్లేందుకు విద్యుత్‌ అధికారులు సాహసించటం లేదు. 


ఇది బట్టాపూర్‌ గుట్ట. ఇందులో అతి కొద్ది భాగాన్నే లీజుకు తీసుకున్నారు. (2015లో గూగుల్‌ ఎర్త్‌ చిత్రం ఇది)  


ప్రస్తుతం బట్టాపూర్‌ గుట్ట దాదాపు కనుమరుగైన పరిస్థితి. (2022లో గూగుల్‌ ఎర్త్‌ చిత్రం ఇది) 

అన్నిచోట్లా ఇదే తంతు.. 
►రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సర్వే నంబర్‌ 268లో 680 ఎకరాల్లో ఉన్న మైనింగ్‌ జోన్‌లోనూ పలు అక్రమాలు చోటు చేసుకుంటు న్నట్లు ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వం నుండి లీజు మంజూరైన వాటిలో మెజారిటీ సంస్థలు తమ లీజులను అనధికారికంగా ఇతరులకు విక్రయించేశాయి. ఈ జోన్‌లోని మెజారిటీ లీజులు ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి వచ్చేశాయి.
 
►నిబంధనల మేరకు క్వారీ తవ్విన ప్రాంతాలను మళ్లీ మట్టితో నింపి చదును చేయాల్సి ఉండగా ఆ పని ఎవరూ చేయటం లేదు. ఇక మైనింగ్‌ కోసం ఏకంగా నాలుగు ఇంచుల బోర్లు వేస్తూ వాటిలో పేలుడు పదార్థాలు నింపి పేల్చేస్తున్నారు. తీసుకున్న లీజు పరిధిని మించి మైనింగ్‌ చేస్తున్నారు. జియో ట్యాగింగ్‌ ఫిట్‌ మెజర్‌మెంట్‌ పక్కాగా జరగటం లేదన్న ఫిర్యాదులున్నాయి. 

►సంగారెడ్డి జిల్లాలో మైనింగ్‌ క్వారీల పేలుళ్లతో భూ ప్రకంపనలు నిత్యకృత్యమయ్యాయి. పటాన్‌చెరు, జిన్నారం, గుమ్మడిదల తదితర మండలాల్లోని క్వారీల్లోనూ తీసుకున్న అనుమతుల కంటే భారీ విస్తీర్ణంలో తవ్వకాలు చేస్తున్నారు.పరిమితికి మించిన పేలుడు పదార్థాలు వాడుతుండటంతో మాదారాం, లకుడారం గ్రామాల్లో ఇళ్లకు బీటలు పడుతున్నాయి. పంట పొలాలు దెబ్బతింటున్నాయి.  

►క్వారీలు, క్రషర్ల నిర్వాహకులంతా కీలక ప్రజాప్రతినిధులు కావటం, వారు సిఫారసు చేసిన అధికారులే పర్యవేక్షకులు కావడంతో క్రషింగ్‌ నిరాటంకంగా కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు