Kokapet Land Auction: ఎకరానికి వంద కోట్లు.. కోకాపేట వేలంలో ఆల్‌టైం రికార్డు, హైదరాబాద్‌ చరిత్రలో అధిక రేటు?!

3 Aug, 2023 21:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేటలో హెచ్‌ఎండీఏ చేపట్టిన భూముల అమ్మక ప్రక్రియ సంచలనాలకు నెలవైంది. కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌ భూముల ధరలు అంచనాలకు మించి పలికాయి. అత్యధిక ధరతో ఆల్‌ టైం రికార్డు నెలకొల్పడమే కాకుండా.. హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధిక రేటుకి భూమి అమ్ముడుపోయిన రికార్డూ నెలకొన్నట్లు తెలుస్తోంది. 

కోకాపేట భూముల్లోని నియోపోలీస్‌ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు  గురువారం వేలం వేసింది హెచ్‌ఎండీఏ. ప్లాట్‌ నెంబర్‌ 10లో  3.60 ఎకరాలు ఉండగా.. ఎకరాకి రూ. 100.75 కోట్లు వేలంలో పలికింది. ఈ ఒక్క ప్లాట్‌తోనే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది.  దీంతో హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు. అత్యల్పంగా ఎకరానికి రూ.67.25 కోట్లు వచ్చాయి.


ఈ ప్లాట్‌లలోని భూముల్లో ఎకరానికి.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ. 35 కోట్లుగా ఉంది. అయితే.. కోటాపేట భూముల్లో.. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలు పలికింది.  మొత్తంగా 45 ఎకరాల్లో(45.33 ఎకరాలు) ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించుకోవాలనుకుంది హెచ్‌ఎండీఏ. కానీ, సగటున రూ.73.23 కోట్లతో మొత్తంగా రూ.3,319 కోట్లు సమీకరించుకోగలిగింది.

మరిన్ని వార్తలు