TS: రాష్ట్రంలో అనాథ వసతిగృహాలెన్ని? 

10 Jan, 2022 04:54 IST|Sakshi

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆరా 

గుర్తించిన పిల్లలకు స్మార్ట్‌కార్డులు!

సాక్షి, హైదరాబాద్‌: అనాథల సంరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక పాలసీని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుదీర్ఘ అధ్యయనం చేసి సలహాలు, సూచనలతో కూడిన నివేదిక ఇవ్వాలంటూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనాథల వసతిగృహాలు, అనాథల లెక్క తేల్చే పనిలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిమగ్నమైంది. అధికారిక లెక్కల ప్రకారంరాష్ట్రవ్యాప్తంగా 57 అనాథ వసతిగృహాలు నమోదయ్యాయి. మరో 2 వందల వరకు అనధికారికంగా కొనసాగుతున్నట్లు అధికారుల అంచనా. వీటి పరిధిలో దాదాపు 34 వేల మంది పిల్లలున్నారు. అయితే వీరిలో పాక్షిక, పూర్తి అనాథులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వసతిగృహాల గుర్తింపు, పిల్లల లెక్కలను కచ్చితంగా తేల్చేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వసతిగృహాలను సందర్శించి పిల్లల సంఖ్యను నిర్ధారించనుంది. ఇలా గుర్తించిన పిల్లలకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి సూచించింది.  

పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికం...  
రాష్ట్రంలో కొనసాగుతున్న అనాథ వసతిగృహాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. స్వచ్ఛందసంస్థలు నిర్వహించే వసతిగృహాలకు ప్రభుత్వ గుర్తింపు ఉండగా, స్వతంత్రులు నిర్వహించేవాటికి మాత్రం గుర్తింపు లేదు. రాష్ట్రంలోని అనాథ వసతిగృహాల్లో 80 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చ ల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చేవారంలో మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి అనాథల లెక్కింపు ప్రక్రియను వేగవంతం చేసేలా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. అనాథ వసతిగృహాలను సందర్శించి తనిఖీలు చేసే కమిటీలు వసతిగృహం నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు(ట్రాక్‌ రికార్డు)ను క్షుణ్ణంగా పరిశీలించనుంది. వసతిగృహం నిర్వహణకు వచ్చే నిధులు, విరాళాలను సైతం పరిశీలించి వసతిగృహాల వారీ గా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనుంది.    

మరిన్ని వార్తలు