మళ్లీ గోదారమ్మ ఉగ్రరూపం! 

2 Sep, 2020 05:36 IST|Sakshi
లక్ష్మీ బ్యారేజీ నుంచి దిగువకు వెళ్తున్న వరద నీరు

ఉప్పొంగుతున్న ప్రాణహిత, పెన్‌గంగ నదులు 

లక్ష్మీ బ్యారేజీ నుంచి 8.60 లక్షల క్యూసెక్కులు దిగువకు.. 

భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం 

ఇటు కృష్ణాలో మరింత తగ్గిన వరద 

ప్రకాశం బ్యారేజీ నుంచి 15,730 క్యూసెక్కులు కడలిలోకి 

భీమా ప్రవాహానికి నిండిన ఉజ్జయిని.. గేట్లు ఎత్తివేత  

సాక్షి, హైదరాబాద్‌: శాంతించినట్లే శాంతించిన గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీ బ్యారేజ్‌ 65 గేట్లు ఎత్తి.. 8.60 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి శబరి, తాలిపేరు, కిన్నెరసాని, కొండవాగుల ప్రవాహం తోడవ్వడంతో గోదావరిలో వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,06,032 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 11,600 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 3,89,032 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
 
కృష్ణాలో వరద తగ్గుముఖం.. 
ఇటు పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం వల్ల కృష్ణాలో వరద తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల నుంచి విద్యుత్‌ కేంద్రాల ద్వారా పరిమిత స్థాయిలో ప్రవాçహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం 22,345 క్యూసెక్కులకు తగ్గింది. ప్రధాన ఉపనది భీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్‌ మంగళవారం నిండటంతో గేట్లు ఎత్తి 2,137 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నది పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిస్తే.. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని, జూరాల డ్యామ్‌లు నిండటం వల్ల వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేయక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ నెలలో కూడా కృష్ణాకు భారీగా వరదలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద తగ్గుముఖం పట్టింది. బ్యారేజీలోకి 32,435 క్యూసెక్కులు వస్తుండగా.. కృష్ణా డెల్టాకు 16,705 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 15,730 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు