Hyderabad: రెస్టారెంట్లో పెట్టుబడులంటూ రూ.13 కోట్లు స్వాహా 

30 Jun, 2022 15:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసి  క్యూబా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ను చూపిస్తూ అందులో పెట్టుబడుల పేరుతో అనేక మంది నుంచి రూ. 13 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో తల్లీకుమారులను సీసీఎస్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. క్యూబా డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ నిర్వహించే నాగెల్లి రూపస్‌ ఆయన భార్య నాగెల్లి సుకన్య, కుమారుడు జసింత్‌ జీటీఎఫ్‌ఎల్‌ మినిస్ట్రీస్‌ పేరుతో చర్చిల్ని నిర్వహిస్తున్నారు.

అక్కడకు వచ్చిన వారిని నమ్మించిన ఈ త్రయం వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేశారు. 2017–18ల్లో దాదాపు 30 మంది నుంచి రూ.13 కోట్ల వరకు తీసుకున్నారు. తమ డబ్బు ఇవ్వమని అడిగిన వారిని బెదిరించడం వారిపైనే కేసులు పెట్టడం చేస్తున్నారు. వీరికి రూ.కోటి వరకు ఇచ్చి మోసపోయిన కేవీ ప్రసాద్‌ అనే బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఏసీపీ సందీప్‌కుమార్‌ బుధవారం సుకన్య, జసింత్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రూపస్‌ కోసం గాలిస్తున్నారు. వీళ్లు విదేశాల్లోని వారి నుంచి డబ్బు తీసుకున్నారని, తెనాలీలోనూ వీరిపై కేసులు ఉన్నాయని ప్రసాద్‌ తెలిపారు.   
చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. టెన్షన్‌.. అటెన్షన్‌!

మరిన్ని వార్తలు