Manipur Landslides: కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి

30 Jun, 2022 15:31 IST|Sakshi

ఇంపాల్‌: మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. దీని రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో 107 టెరిటోరియల్ ఆర్మీ బేస్‌ క్యాంప్‌ని ఏర్పాటు చేశారు. కాగా బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ బేస్‌ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది.  ఇప్పటివరకు 19 మందిని రక్షించారు. ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.


 

చదవండి: ఔరంగాబాద్‌ పేరు మార్పు తప్పుడు నిర్ణయం: ఏఐఎంఐఎం 

మరిన్ని వార్తలు