‘లీకేజీ’లకు నిరసనగా.. నేడు సంజయ్‌ దీక్ష

17 Mar, 2023 07:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/చంచల్‌గూడ: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్న పత్రాల లీకేజీలను నిరసిస్తూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతరనేతలు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల దాకా నిరసన తెలపనున్నారు. పేపర్‌ లీకేజీలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ, ఐటీమంత్రి కేటీఆర్‌ బర్తరఫ్, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం వంటి డిమాండ్లతో ఈ దీక్ష నిర్వహిస్తున్నారు. బండి సంజయ్‌ తొలుత పార్టీ నేతలతో కలసి గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అరి్పస్తారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్షలో పాల్గొంటారు.  

లీకేజీలో కేటీఆర్‌ ప్రమేయం: బండి సంజయ్‌ 
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ ప్రమేయం ఉందని బండి సంజయ్‌ ఆరోపించారు. లీకేజీ వ్యవహారానికి నిరసనగా ధర్నా చేసిన బీజేవైఎం నాయకులు భానుప్రకాశ్‌ తదితరులను పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. గురువారం వారిని ములాఖాత్‌లో పరామర్శించేందుకు బండి సంజయ్‌ జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేపర్‌ లీకేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలన్నారు. దీనికి సూత్రధారి రేణుక బీఆర్‌ఎస్‌కే చెందినవారని ఆరోపించారు. లీకేజీలతో బీజేపీకి సంబంధం ఉందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండించారు.

మరిన్ని వార్తలు