నేరాల్లో 10% తగ్గుదల..!

22 Dec, 2020 09:30 IST|Sakshi

సైబర్‌ మినహా అన్ని రకాల నేరాల్లోనూ ఇదే పంథా 

సైబర్‌ క్రైమ్‌ కేసుల సంఖ్య మాత్రం రెట్టింపు

వార్షిక నివేదిక విడుదల చేసిన సీపీ అంజనీకుమార్‌ 

సాక్షి హైదాబాద్‌: టెక్నాలజీ వినియోగం.. నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర.. నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్‌ ప్రయోగం వంటి చర్యలు.. వెరసి హైదరాబాద్‌ నగరంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లో కలిపి దాదాపు 10 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్‌ 20 వరకు నమోదైన నేరాల గణాంకాలను సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్‌ విడుదల చేశారు. సైబర్‌ నేరాల సంఖ్య మాత్రం గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. 

తగ్గిన ‘మరణాలు’.. 
రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాల సంఖ్య తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసు విభాగం స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతోంది. ఫలితంగా ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రులతో పాటు మృతుల సంఖ్య తగ్గింది. 
                                2018    2019    2020     
మొత్తం ప్రమాదాలు       2,431    2,496    1,738         
క్షతగాత్రులు                2,435    2,649    1,793 
మృతులు                       293     271         237 

‘దిశ’ఉదంతం తర్వాత మహిళల భద్రతపై అన్ని విభాగాలు దృష్టి పెట్టాయి. సాధారణ సమయంలోనూ మహిళలు/యువతులపై జరిగే నేరాలను అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

మహిళలపై నేరాలు..   2018       2019        2020 
మొత్తం కేసులు          2,286       2,354      1,908     
వరకట్న హత్యలు            17             3            2    
అత్యాచారం                  178           281      265     
కిడ్నాప్‌లు                  134              95        60 
ఆత్మగౌరవానికి భంగం 
కలిగించడం                 373            448      438 
వేధింపులు               1,342        1,462    1,043 

శిక్షలు ఇలా..                   2018       2019      2020 
విచారణ ముగిసిన కేసులు    4,245    4,947    2,688 
నేరం నిరూపితమైనవి          1,471    2,092    1,964 
శిక్షల శాతం                           34          42         73 

చోరీ అయిన సొత్తు రికవరీ..              2018               2019                   2020 
చోరీ అయిన సొత్తు విలువ          రూ.74.05 కోట్లు    రూ.27.78 కోట్లు    రూ.26.15 కోట్లు 
రికవరీ                                   రూ.62.97 కోట్లు    రూ.16.26 కోట్లు    రూ.17.24 కోట్లు 
శాతం                                              86                      59                      66  

సైబర్‌ క్రైం పెరిగింది..
ఈ సందర్భంగా అడిషపల్‌ సీపీ షిఖా గోయల్‌ మాట్లాడుతూ.. ‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్‌ క్రైం పెరిగింది. 2019లో 1,393 సైబర్ కేసులు నమోదయితే  2020 లో 2,406 కేసులు నమోదు అయ్యాయి. ఇంటర్ నెట్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు రాజస్తాన్‌లోని జంతారా నుంచే జరుగుతున్నాయి. 25 శాతం ఓటీపీ మోసాలు పెరిగాయి. ఆన్‌లైన్‌ గేమింగ్ యువతను ఆకర్షిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఈ మధ్య భారీగా పెరిగాయి. 100 యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్ లో ఉన్నాయి.  మైక్రో ఫైనాన్స్ ద్వారా అప్పులు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో భాదితుల ఫోటోలు, అలాగే కాంటాక్ట్‌లకు మెసేజ్‌లు పంపుతున్నారు. వీరి వేధింపులకు ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు. ఇలాంటి యాప్‌లు ఎవరు డౌన్‌లోడ్‌ చేసుకొని మోసపోవద్దు’ అన్నారు. (చదవండి: ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో గమనించండి)

‘ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు చేసిన 12 రాష్ట్రాలకు చెందిన 259 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. 19 మ్యాట్రిమోని కేసులు నమోదు అయ్యాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. చైనా బేస్‌గా ఆన్‌లైన్ గేమింగ్‌పై తెలంగాణలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఆన్‌లైన్‌ గేమింగ్ తెలంగాణలో నిషేధం. ఆన్‌లైన్‌ గేమింగ్ కేసులో 170 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశాం. చైనా దేశస్తుడిని అరెస్ట్ చేశాం. ఇప్పటి వరకు 16వందల కోట్ల ట్రాన్సక్షన్ జరిగినట్టు గుర్తించాం’ అని షిఖా గోయల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు