మెట్రోకు సమ్మర్‌ ఫీవర్‌.. పగుళ్లకు కోటింగ్‌..పట్టాలకు లూబ్రికేషన్‌! 

18 Feb, 2023 08:46 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వేసవిలో మెట్రో నిర్వహణ భారంగా మారింది. పలు మెట్రో స్టేషన్లకు ఏర్పడిన పగుళ్లు.. పట్టాలపై రైళ్లు పరుగులు తీసినపుడు మలుపుల వద్ద రణగొణ ధ్వనులు వెలువడుతుండడంతో తరచూ ఆందోళన వ్యక్తమౌతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టే అంశంపై ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ దృష్టి సారించింది. ప్రమాణాల మేరకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం మెట్రో ప్రాజెక్టులోని స్టేషన్లు, పిల్లర్లు తదితర సివిల్‌ నిర్మాణాలకు పగుళ్ల నివారణ, మన్నిక పెంచేందుకు ఇతర నిర్వహణపరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.

నగరంలో ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మూడు మార్గాల్లోని మొత్తం మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న వయాడక్ట్‌ పారాపెట్స్‌ (పిట్టగోడలు)ను సైతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పలు చోట్ల స్టేషన్లకు వెంట్రుకవాసి పరిమాణంలో ఏర్పడిన పగుళ్లకు ఎపాక్సీ పదార్థంతో కోటింగ్‌ వేసి సరిచేస్తున్నట్లు తెలిపారు. మూడు రూట్లలో నిరంతరాయంగా రైళ్లు పరుగులు తీస్తున్న నేపథ్యంలో మెట్రో మార్గం పలు కంపనాలకు గురవుతుండడం, వాతావరణ మార్పుల కారణంగా తరచూ పగుళ్లు ఏర్పడుతున్నట్లు వివరించారు. ఇది సాధారణ పరిణామమేనని స్పష్టంచేశారు.  

రణగొణ ధ్వనులు వెలువడకుండా చర్యలు... 
నగరంలో మెట్రో మార్గం పలు ములుపులు తిరిగి ఉంది. నగర భౌగోళిక స్ధితి కారణంగా దేశంలో మరే ఇతర మెట్రో రైల్‌ మార్గంలో లేని విధంగా వినూత్నమైన రీతిలో మలుపులు, ఎత్తుపల్లాలతో అలైన్‌ మెంట్‌ ఉంది. ఈ నేపథ్యంలో మలుపుల వద్ద మెట్రో పట్టాలు, చక్రాల మధ్య రాపిడి కారణంగా కీచుమనే శబ్దాలు, అతిధ్వనులు అధికంగా వెలువడుతున్నాయి.

ఈ సమస్యను పరిష్కరించి..రణగొణ ధ్వనులను నివారించేందుకు పట్టాలకు ట్రాక్‌ లూబ్రికేషన్‌ చేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. తద్వార కంపనాలు పెరిగిన సమయంలో శబ్ద స్థాయిలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరచుగా శబ్ద స్థాయిని పర్యవేక్షిస్తున్నామన్నారు. పీసీబీ నిర్దేశించిన ప్రమాణాల మేరకు శబ్దకాలుష్యం ఉందని తెలిపారు. విశ్వసనీయ ఇంజినీరింగ్‌ సంస్థగా, ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో నిలుస్తుందని..స్వల్ప పగుళ్లు, శబ్దకాలుష్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని సంస్థ భరోసానిస్తుండడం విశేషం.
చదవండి: ఆ కరెంటుతో షాకే..

మరిన్ని వార్తలు