Hyderabad: సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌.. నెరవేరని సీఎం కేసీఆర్‌ హామీ!

24 Jan, 2022 11:13 IST|Sakshi
సరూర్‌నగర్‌ చెరువులో పేరుకుపోయిన చెత్త 

అభివృద్ధికి నోచుకోని సరూర్‌నగర్‌ మినీట్యాంక్‌ బండ్‌

దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందులు 

సాక్షి, చైతన్యపురి: నగరంలో మినీ ట్యాంక్‌ బండ్‌గా ప్రసిద్ధి చెందిన సరూర్‌నగర్‌చెరువు నానాటికి దుర్గంధ భరితంగా తయారైంది. సందర్శకులు సేదతీరేందుకు రావాలంటేనే బయపడే పరిస్థితి నెలకొంది. దుర్వాసన కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.  సరూర్‌నగర్‌ మినీట్యాంక్‌ బండ్‌ను హుస్సేన్‌ సాగర్‌లా అభివృద్ధి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా నెరవేరకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు సరూర్‌నగర్‌ చెరువు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

1906లో అప్పటి నైజాం రాజు తాగు, సాగునీటి అవసరాల కోసం 99 ఎకారాల విస్తీర్ణంలో సరూర్‌నగర్‌ చెరువును తవ్వించారు. ఇటలీ నుంచి పక్షులు సరూర్‌నగర్‌ చెరువుకు విడిదికి వచ్చేవి. 
చదవండి: ‘విషం తాగించి, హత్యాయత్నం చేశారు.. నా భర్తతో ప్రాణహాని ఉంది’

► నగరం అభివృద్ధి చెందటం, చెరువు చుట్టూ ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం చెరువు   60 ఎకరాలు మిగిలింది.  
► పాత సరూర్‌నగర్‌ మండలంలోని గ్రామాలనుంచి, అక్కడి చెరువుల నుంచి మురుగునీరు సరూర్‌నగర్‌ చెరువులో కలుస్తుండటంతో మురికి కూపంలా తయారైంది. 
► దీనికి తోడు పరిసర కాలనీల ప్రజలు వ్యర్థాలను వేయటంతో పరిస్థితిదారుణంగా మారింది.  దీంతో వలస పక్షులు రావటం మానేశాయి. 
► 2003లో స్థానికుల ఆందోళనతో రూ.3 కోట్లతో సివరేజ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ సక్రమంగా పనిచేయక పోవటంతో చెరువు మురుగునీటితో నిండి పోయింది.  
► చెరువు అభివృద్ధిలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని పార్కును ఏర్పాటు చేసి బోటింగ్‌ సౌకర్యం కల్పించారు. అయితే, నీరు దుర్గంధ భరితంగా మారడంతో బోటింగ్‌కు ఆదరణలేకుండా పోయింది.  
►చెరువులోకి వచ్చే మురుగు నీటి శుద్ధికి ఏర్పాటు చేసిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనిచేయకపోవటంలో సమీప ప్రాంత కాలనీల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. దోమల బెడదతో కూడా ఎక్కువగా ఉంది. 
► దుర్వాసన కారణంగా సందర్శకులు కూడా మినీట్యాంక్‌ బండ్‌పై ఉండలేని పరిస్థితి నెలకొంది.  

ముఖ్యమంత్రి హామీ ఏమైంది ? 
► తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మినీ ట్యాంక్‌ బండ్‌ను సందర్శించి హుస్సేన్‌ సాగర్‌లా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అంతేకాక రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సరూర్‌నగర్‌ మినీట్యాంక్‌ బండ్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

శాఖల మధ్య సమన్వయ లోపం 
జీహెచ్‌ఎంసీ, లేక్‌ అభివృద్ధి శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే మినీట్యాంక్‌బండ్‌ అభివృద్ధి జరగటం లేదు. చెరువులోకి మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశాం. చెరువులో వ్యర్థాలు వేయకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని కోరాం. చెరువు ఔట్‌లెట్‌ వద్ద నాలాల్లోకి చెత్త చేరకుండా జాలీ ఏర్పాటు చేయాలని కోరాం.మా   జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  
  –బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్, గడ్డిఅన్నారం డివిజన్‌ 

మరిన్ని వార్తలు