పార్కింగ్‌ బాధ్యత యజమానులదే: హైకోర్టు 

21 Jun, 2022 20:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్‌లు, సినిమా థియేటర్లు.. తదితర చోట్ల వినియోగదారులకు పార్కింగ్‌ వసతి కల్పించాల్సిన బాధ్యత వాటి యజమానులదే అని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెయింటనెన్స్‌ పేరు చెప్పి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అక్రమంగా పార్కింగ్‌ ఫీజుల వసూలు విషయం న్యాయ మూర్తుల దృష్టికి రావడంతో హైకోర్టు ఈ అంశాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా విచారణకు స్వీకరించింది.

దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్‌లు, సినిమా థియేటర్లు.. లాంటి భవనాలను నిర్మించే సమయంలోనే మున్సిపల్‌ నిబంధనల ప్రకారం పార్కింగ్‌ సదుపాయం ఉందా? లేదా? అని చూసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఫీజు వసూలు చేయడం గతంలో తాము ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ప్రణాళిక శాఖ డైరెక్టర్‌తో పాటు రెవెన్యూ, హోం శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు