తన వద్దకు రావొద్దంటూ.. ఆస్పత్రి భవనంపై నుంచి దూకిన బాలింత

4 Feb, 2022 21:49 IST|Sakshi
గాయాలకు గురైన సంపూర్ణను చికిత్స నిమిత్తం తరలిస్తున్న సిబ్బంది   

సాక్షి, హైదరాబాద్‌: ప్రసూతి కోసం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన ఓ బాలింత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి వర్గాలు, పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన సంపూర్ణ(33) గత నెల 26వ తేదీన ప్రసవం కోసం పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. 29వ తేదీన ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒక బాలుడు, ఒక బాలిక జన్మించగా ఇరువురు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళ ప్రసవించిన అనంతరం రెండు, మూడు రోజులుగా నిద్రలేని సమస్యతో ఏదో ఆలోచనతో బాధపడుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు.

గురువారం ఆమె భర్త సంపూర్ణను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చాడు. అప్పటికే మానసిక ఒత్తిడితో ఉన్న ఆమె భర్తను చూసి మరింత ఒత్తిడికి గురై ఆసుపత్రి ఆవరణలోనే గట్టిగా ఆరుస్తూ తన వద్దకు రావొద్దంటూ.. వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గట్టిగా అరుస్తూ ప్రధాన గేటు వైపు నుంచి మొదటి అంతస్తు నుంచి దూకడానికి ప్రయత్నించింది. అప్పటికే పరిస్థితిని అర్థం చేసుకున్న ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు ఆమె దూకడాన్ని గమనించి అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడారు. స్వల్ప గాయాలకు గురైన ఆమెను ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, భర్తపై కోపంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు చార్మినార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: హైదరాబాద్‌: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి

మరిన్ని వార్తలు