నిజాంపేట్‌లో‌ అపార్ట్‌మెంట్లకు ఏమైంది!

16 Dec, 2020 12:21 IST|Sakshi

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం..!

103 భవనాలను సీజ్‌ చేసిన అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌‌: అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సదరు నిర్మాణాలు పూర్తయినా కూడా వాటిని వదిలిపెట్టడం లేదు. ఇటీవల నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కమిషనర్‌ గోపి ఆదేశాల మేరకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమంగా నిర్మించిన 103 భవనాలను గుర్తించి సీజ్‌ చేశారు. 

  • గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నప్పుడు అనుమతులతో జీ ప్లస్‌–4 అంతస్తులు నిర్మించారు. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్‌ మూడు గ్రామాలు కలిపి కార్పొరేషన్‌గా గత సంవత్సరం ఏర్పాటైంది. అంతకు ముందు వచ్చే నుంచే విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కమిషనర్‌ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడంతో యజమానులు, కాంట్రాక్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. 
  • కార్పొరేషన్‌ ఏర్పడిన నాటి నుంచి బిల్డర్లు నిర్మాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ముకుందరెడ్డి గత ఏడాది నవంబరు 1న అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. 
  • ఈ ఏడాది మే 16న ప్రస్తుత కమిషనర్‌ గోపి సుమారు 1000కి పైగా అక్రమ నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖ రాశారు. కరోనా ప్రభావం, ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో రిజిస్ట్రేషన్  నిలిపివేయడం పనులు నిలిచాయి. 

యథాతథంగా పనుల నిర్వహణ.. 

  • కార్పొరేషన్‌ అధికారులు ఇటీవల సీజ్‌ చేసిన భవనాల్లో యథాతథంగా పనులు కొనసాగుతున్నాయి. సీజ్‌ చేసిన తర్వాత అధికారులు తమ పని పూర్తయినట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. 
  • పనులు జరుగుతున్న విషయం తెలిసినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. 
  • ప్రాథమిక దశలోనే నిర్మాణాలను అడ్డుకుంటే ఎవరికీ నష్టం జరగదని, నిర్మాణం పూర్తయిన తర్వాత సీజ్‌ చేస్తే ఎలా అని పలువురు ఆరోపిస్తున్నారు.

ఏమాత్రం ఉపేక్షించం.. 
సీజ్‌ చేసిన అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశాం. అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు ఇవ్వాలని కోరాం. అన్నీ పరిశీలించిన తర్వాతే అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 103 భవనాలను సీజ్‌ చేశాం. 
– గోపి, కమిషనర్, నిజాంపేట్‌ కార్పొరేషన్‌ 
 

మరిన్ని వార్తలు