Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షం.. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

22 Jul, 2022 21:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉపరితల  ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. 

హాఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 9.85 సెంమీ వర్షపాతం నమోదైంది. బాలానగర్‌ 9.83 సెం.మీ, గాజుల రామారం 9.7 సెం.మీ, బాలాజీనగర్‌ 8.7 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 8.5 సెం.మీ వర్షపాతం జీడిమెట్ల 9.7 సెం.మీ రాజేంద్రనగర్‌ 8.2 సెం.మీ,కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లిలో 8 సెం.మీ వర్షపాతం, మాదాపూర్‌ 7.65 సెం.మీ, మౌలాలీ 7.25 సెం.మీ, నెరేడ్‌మెట్‌ 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక మచ్చబొల్లారం, జగద్గిరిగుట్ట, మియాపూర్‌, ఆర్సీపురం, రంగారెడ్డినగర్‌లో 6 సెం.మీ వర్షాపాతం, ఫతేనగర్‌,  హెచ్‌సీయూ, మోతీనగర్‌లో 5 సెం.మీ వర్షాపాతం నమోదైంది. 

ఇక హైదరాబాద్‌లో రాగల 48 గంటలపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో మోకాళ్లలోతు నీళ్లు వచ్చాయి. రోడ‍్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు