దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో .. 2 గంటల్లో సిలిండర్‌ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..

19 Jan, 2022 07:02 IST|Sakshi

తత్కాల్‌ సేవలను ప్రారంభించిన ఇండేన్‌ 

నెల రోజుల్లో హెచ్‌పీ ఎల్‌పీజీ సర్వీస్‌లు  

‘ప్రియారిటీ’ సేవలు అందిస్తున్న భారత్‌ గ్యాస్‌ 

సిలిండర్‌ ధరపై రూ.25 అదనపు చార్జీ  

నిమిషం ఆలస్యమైనా చార్జీ వాపసు 

సాక్షి, హైదరాబాద్‌: వంట గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ చేసి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. బుకింగ్‌ చేసిన రెండు గంటల్లో బండ ఇంటికొచ్చేస్తుంది. ‘ఇండేన్‌ తత్కాల్‌ సేవ’ పేరిట ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) ఈ తరహా సేవలను ప్రారంభించింది. దేశంలోనే పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల రోజుల వ్యవధిలో హెచ్‌పీ గ్యాస్‌ కూడా ఈ తరహా సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ప్రియారిటీ’ సర్వీస్‌ పేరిట కస్టమర్‌ కోరిన సమయంలో గ్యాస్‌ డెలివరీ సేవలను భారత్‌ గ్యాస్‌ దశాబ్ధ క్రితం నుంచే అందిస్తుంది. 

సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్‌ ఉన్న కుటుంబాలు సిలిండర్‌ బుకింగ్‌ చేశాక.. డెలివరీ కోసం ఎందుకు ఎదురుచూడాలనే ప్రశ్నకు సమాధానమే ‘తత్కాల్‌ సేవ’. పాలు, కూరగాయల తరహాలోనే వంట గ్యాస్‌ కూడా అత్యవసర సర్వీసే. సాధారణంగా గ్యాస్‌ డెలివరీకి 48–72 గంటల సమయం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువే అవుతుంది. గంటల వ్యవధిలోనే సిలిండర్‌ను డెలివరీ చేయాలన్న లక్ష్యంతో తత్కాల్‌ సేవను ప్రారంభించినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఏపీ, తెలంగాణ హెడ్‌ శ్రవణ్‌ ఎస్‌ రావు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 15.20 లక్షల ఇండేన్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 6.15 లక్షలు సింగిల్‌ బాటిల్‌ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 62 ఇండేన్‌ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తత్కాల్‌ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 

బుకింగ్‌ చేసేది ఇలా.. 
ఐవీఆర్‌ నంబర్‌ 77189 55555, సీఎక్స్‌.ఇండియ న్‌ ఆయిల్‌.ఇన్, ఇండియన్‌ఆయిల్‌ వన్‌ యాప్‌ వీటిల్లో ఏ మాద్యమం ద్వారా అయినా తత్కాల్‌ సేవను వినియోగించుకోవచ్చు. 
ఉదయం 8 గంటల నుంచి  సాయత్రం 4 గంట ల మ«ధ్య పని దినాల్లో మాత్రమే బుకింగ్‌ చేయా ల్సి ఉంటుంది.  
సింగిల్‌ సిలిండర్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. తత్కాల్‌ సేవకు సిలిండర్‌ ధరతో పాటు అదనంగా రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 
తత్కాల్‌ సేవలో గ్యాస్‌ బుకింగ్‌ కాగానే.. ఐఓసీ డెలివరీ పర్సన్‌ అప్లికేషన్‌కు ఆర్డర్‌ నోటిఫికేషన్‌ వెళుతుంది. వెంటనే ఆర్డర్‌ డెలివరీ కోసం ప్రాసెస్‌ అవుతుంది. 
సిలిండర్‌ డెలివరీ నిమిషం ఆలస్యమైనా .. గ్యాస్‌ బండను కస్టమర్‌కు అందించి.. తత్కాల్‌ కింద చెల్లించిన రూ.25 చార్జీ కస్టమర్‌కు తిరిగి ఇస్తారు.  

నెల రోజుల్లో హెచ్‌పీ కూడా.. 
ఇండేన్‌ తత్కాల్‌ సేవ ఫీడ్‌ బ్యాక్‌ను విశ్లేషించి.. ఇంకా మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌పీ గ్యాస్‌ సన్నాహాలు ప్రారంభించింది. కస్టమర్‌ సౌకర్యార్థం, అదరపు చార్జీల వసూలు చేసి గంటల వ్యవధిలోనే సిలిండర్‌ను డెలివరీ చేస్తామని హెచ్‌పీ గ్యాస్‌ హైదరాబాద్‌ హెడ్‌ అబ్దుల్‌ ఖాదర్‌ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో హైదరాబాద్‌తో పాటూ మరో నగరంలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ లో 35 లక్షల హెచ్‌పీ కనెక్షన్లు ఉండగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు  తెలిపారు. తెలంగాణ ఎల్‌పీజీ మార్కెట్‌లో హెచ్‌పీ కంటే ఐఓసీఎల్‌ వాటా 5 శాతం ఎక్కువగా ఉంటుంది. 

భారత్‌ గ్యాస్‌ ‘ప్రియారిటీ’ సేవలు.. 
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)కు చెందిన ఎల్‌పీజీ విభాగం భారత్‌ గ్యాస్‌... 15 ఏళ్ల క్రితమే ప్రియారిటీ సర్వీసెస్‌ను ప్రారంభించింది. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగులుగా ఉన్న కుటుంబాలు ప్రియారిటీ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 6 తర్వాత కస్టమర్‌ కోరిన సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ను డెలివరీ సమయాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుందన్నమాట. ప్రియారిటీ సర్వీసెస్‌కు సిలిండర్‌ మీద రూ.15–25 చార్జీ ఉంటుందని భారత్‌ గ్యాస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. తెలంగాణలో 28 లక్షల భారత్‌ గ్యాస్‌ కనెక్షన్లుండగా.. వీటిల్లో 14.4 లక్షల కనెక్షన్లు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నట్లు ఆయన వివరించారు.   

మరిన్ని వార్తలు