ప్రియమైన మాస్టారికి.. మరపురాని సన్మానం

22 Dec, 2020 15:15 IST|Sakshi

ఎడ్లబండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు

పదవీ విరమణ సందర్భంగా సన్మానం 

అభిమానం చాటుకున్న విద్యార్థులు

కేసముద్రం: అక్షరాలు దిద్దించి విజ్ఞానాన్ని పంచిన గురువులకు విద్యార్థుల మదిలో ఎల్లప్పుడూ ఉన్నత స్థానం ఉంటుంది. అమ్మ భాష తెలుగును బోధించే ఉపాధ్యాయుల పట్ల ఆదరాభిమానాలకు హద్దే ఉండదు. అందుకే తెలుగు మాస్టారంటే విద్యార్థులకు అంత ఇష్టం. అలాంటి ఉపాధ్యాయుడొకరికి విద్యార్థులు మరపురాని విధంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ‘మా దేవుడు మీరే మాస్టారు’ అంటూ గురువును విభిన్నంగా గౌరవించుకున్నారు.

విద్యాబుద్ధులు నేర్పిన ఓ ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ఆయనను మేళతాళాల మధ్య ఎడ్ల బండిపై ఊరేగించి విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో పంజాల సోమనర్సయ్య తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులంతా కలిసి సోమవారం సన్మానం ఏర్పాటు చేశారు. సోమనర్సయ్య దంపతులను గ్రామపంచాయతీ నుంచి ఎడ్లబండిపై మేళతాళాల నడుమ ఊరేగింపుగా కిలోమీటర్‌ దూరంలోని పాఠశాల ఆవరణానికి తీసుకువచ్చి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దార్ల రామమూర్తి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు దికొండ యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శభాష్‌.. తెలంగాణ పోలీస్‌!)

మరిన్ని వార్తలు