జమ్మికుంట సీఐకి ‘ఉత్తమ్‌ జీవన్‌ రక్ష’

26 Jan, 2021 13:47 IST|Sakshi

జీవన్‌ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం.. 

సాక్షి, న్యూఢిల్లీ: సాటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఇచ్చే జీవన్‌ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఇందులో ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకానికి ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి కూడా ఉన్నారు.. సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకం, ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకం, జీవన్‌ రక్ష పతకం విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రదానం చేస్తోంది. 2020 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా మొత్తం 40 మందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు. సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని ఒకరు, ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని 8 మంది, జీవన్‌ రక్ష పతకాన్ని 31 మంది అందుకోనున్నారు. వీరిలో కేరళకు చెందిన ముహమ్మద్‌ హుష్రీన్‌ (మరణానంతర)కు సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని కేంద్రం ప్రకటించింది. 

ఇద్దరిని కాపాడినందుకు..
ఇక 2019 మే 28న కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో చేద బావి పూడిక కోసం బావిలోకి దిగి స్పృహ కోల్పోయిన ఇద్దరు గ్రామస్తులను జమ్మికుంట టౌన్‌ సీఐ సృజన్‌రెడ్డి కాపాడారు. ఘటనపై సత్వరమే స్పందించిన ఆయన బావిలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిని రక్షించారు. దీనిని గుర్తించిన కేంద్రం సృజన్‌రెడ్డిని 2020 సంవత్సరానికి గాను ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకానికి ఎంపిక చేసింది.

మరిన్ని వార్తలు