55,000 వరకు నేషనల్‌ లెవల్‌

24 Apr, 2023 04:12 IST|Sakshi

త్వరలో  జేఈఈ మెయిన్‌ ర్యాంకులు  విడుదల 

అంతలోపు ర్యాంకు వస్తేనే జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రవేశం

ఈసారి దేశవ్యాప్తంగా 10 వేల సీట్లు పెరిగే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు కోసం ఈ నెల 15 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ ఎంట్రన్స్‌ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తమకు ఏ ర్యాంకు వస్తుంది? ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే ఉత్సుకత విద్యార్థుల్లో నెలకొంది. గతేడాది జేఈఈ అంచనాలు, ఈసారి పేపర్‌ విధానాన్ని పరిశీలిస్తే జేఈఈ మెయిన్‌లో 55 వేల వరకు ర్యాంకు వచ్చిన వాళ్లకు కూడా జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏదో ఒక కోర్సులో, ఎక్కడో ఒకచోట సీటు ఖాయమని తెలుస్తోంది.

ఈడబ్ల్యూఎస్‌కు 60 వేలు, ఓబీసీలకు 65 వేలు, ఎస్సీలకు 1.20 లక్షలు, ఎస్టీలకు 3 లక్షలు, పీడబ్ల్యూడీలకు 8 లక్షల ర్యాంకు వచ్చినా జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. అయితే కంప్యూటర్‌ సైన్స్, నచ్చిన కాలేజీలో సీటు కోసం మాత్రం పోటీ ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరంగల్, సూర్తాల్, తిరుచాపల్లి వంటి ఎన్‌ఐటీ కాలేజీల్లో సీటు రావాలంటే జేఈఈ మెయిన్‌లో 5 వేలలోపు ర్యాంకు వరకే ఆశలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 

30 నుంచి దరఖాస్తులకు అవకాశం... 
ఈ నెల 30 నుంచి జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశాల అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. ఈసారి జేఈఈ మెయిన్‌ ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రాశారు. వారిలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనున్నారు.

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కాలేజీలతోపాటు రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీ–కేటగిరీ సీట్లలో ప్రాధాన్యం పొందుతారు. దేశవ్యాప్తంగా ఈసారి 10 వేల ఇంజనీరింగ్‌ సీట్లు పెరిగే వీలుంది. కొత్త కోర్సులకు అనుమతించడం, కొన్ని కాలేజీల్లో సీట్లు పెంచడమే దీనికి కారణం. ఐఐటీల్లో 16,053 సీట్లు, ఎన్‌ఐటీల్లో 24 వేలు, ట్రిపుల్‌ ఐటీల్లో 16 వేలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో 6,078 సీట్లున్నాయి.

గతేడాది పర్సంటైల్‌ను పరిశీలిస్తే జనరల్‌ కేటగిరీలో 88.41 పర్సంటేల్‌ వస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. ఓబీసీ ఎన్‌సీఎల్‌కు 67.00, ఈడబ్ల్యూఎస్‌కు 63.11, ఎస్సీలకు 43.08, ఎస్టీలకు 26.77, పీడబ్ల్యూడీలకు 0.003 పర్సంటేల్‌తో అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌ ఖరారైంది. ఈసారి కూడా పోటీని బట్టి కటాఫ్‌ గతేడాదికి కొంచెం అటుఇటుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆలోచించి అడుగేయాలి..
జేఈఈ మెయిన్‌లో టాప్‌ పర్సంటైల్‌ వచ్చిన వారు సాధారణంగా అడ్వాన్స్‌డ్‌కు వెళ్తారు. మెయిన్‌లో అర్హత పొంది, 55 వేల ర్యాంకు వరకు వస్తే మాత్రం ఎన్‌ఐటీ కాలేజీల్లో సీటు పొందే వీలుంది. ర్యాంకు ఎంతో తెలిశాక ఆచితూచి అడుగేయాలి.

కాలేజీతో ప్రాధాన్యం లేదనుకుంటే ఇప్పటివరకు వస్తున్న ర్యాంకులను బట్టి ముందుకెళ్లాలి. కోరుకున్న కోర్సు, కాలేజీనే కావాలనుకుంటే వచ్చిన ర్యాంకును బట్టి సీటు వస్తుందో లేదో చూసుకోవాలి. లేకుంటే లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకొని వచ్చే ఏడాది మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించడమే మంచిది.     – ఎంఎన్‌ రావు, జేఈఈ మెయిన్‌ బోధన నిపుణుడు 

మరిన్ని వార్తలు