జీనోమ్‌ వ్యాలీలో జుబ్లియెంట్‌ కేంద్రం 

26 Feb, 2023 02:17 IST|Sakshi
జుబ్లియెంట్‌ భార్తియా సంస్థ ప్రతినిధితో  మంత్రి కేటీఆర్‌.. చిత్రంలో జయేశ్‌ రంజన్‌ 

గ్లోబల్‌ మెడికల్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్న సనోఫీ 

మంత్రి కేటీఆర్‌తో భార్తియా, సనోఫీ ప్రతినిధుల భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో అంతర్జాతీయంగా పేరొందిన జుబ్లియెంట్‌ భార్తియా గ్రూప్‌ ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జుబ్లియెంట్‌ భార్తియా వ్యవస్థాపకుడు, కో–చైర్మన్‌ హరి ఎస్‌. భార్తియా శనివారం భేటీ అయ్యారు.

ఫార్మా, పరిశోధన, విలక్షణ ఔషధాలు, లైఫ్‌సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తులు సహా అనేక రంగాల్లో ఉన్న తమ గ్రూప్‌ ఆసియాలో హైదరాబాద్‌ను అత్యాధునిక వసతుల కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్‌ పరిశోధన రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు జుబ్లియెంట్‌ రాకతో క్లినికల్‌ రీసెర్చ్‌ సంస్థలకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్‌ చెప్పారు. 

రాష్ట్రంలో సనోఫీ ‘గ్లోబల్‌ మెడికల్‌ హబ్‌’ 
అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణలో పేరొందిన ‘సనోఫీ’తెలంగాణలో గ్లోబల్‌ మెడికల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సనోఫీ గ్రూప్‌ ఆఫ్‌ సైట్స్‌ హెడ్‌ మాథ్యూ చెరియన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా తాము గ్లోబల్‌ మెడికల్‌ హబ్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం, సనోఫీ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు, భాగస్వామ్యాలు పెరుగుతాయని మాథ్యూ చెరియన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2025– ఆ తర్వాత’అనే విజన్‌లో భాగంగా ఏర్పాటయ్యే గ్లోబల్‌ మెడికల్‌ హబ్‌లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు