మాకే ఎందుకు కడుపు‘కోత’?.. మరో మహిళకు ఇలా జరగకూడదు..

16 Dec, 2021 18:11 IST|Sakshi
భర్త, కుమారుడితో మాలతి

   వైద్యుల నిర్లక్ష్యంతో ఆపరేషన్‌

తారుమారై జూన్‌ 26న పాప మృతి

తక్కువ బరువుతో పుట్టిన బాబుకు అనారోగ్య సమస్యలు

నీలోఫర్‌ ఆస్పత్రిలో చూపిస్తామని చెప్పిన అధికారులు మాట తప్పారు

కన్నీరుమున్నీరవుతున్న నర్సింగాపూర్‌ వాసులు 

సాక్షి, వీణవంక(కరీంనగర్‌): తమ కుటుంబంలోకి కవల పిల్లలు రాబోతున్నారని తెలిసి, ఇంటిల్లిపాది ఆనందపడ్డారు.. కుటుంబసభ్యులు ఆ గర్భిణికి పౌష్టికాహారం అందిస్తూ కంటికిరెప్పలా చూసుకున్నారు.. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.. ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 9 నెలల తర్వాత జరగాల్సిన ఆపరేషన్‌ 7వ నెలలో జరగడంతో పాప మృతిచెందింది.. బాబు అతి తక్కువ బరువుతో పుట్టి, తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాడు.. దీంతో బాధిత కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమకు కడుపుకోత మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వారిని ‘సాక్షి’ పలకరించగా కన్నీరుమున్నీరుగా విలపించారు. 

వివరాలిలా ఉన్నాయి.. 
వీణవంక మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరోత్తంరెడ్డి–మాలతిలకు రెండేళ్ల కిందట వివాహమైంది. మాలతి గర్భం దాల్చడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. తర్వాత స్కానింగ్‌లో కవల పిల్ల లు అని వైద్యులు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమెకు ఆహారం మొదలు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో మాలతికి 7వ నెలలో జూన్‌ 16న కడుపునొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు 21 వరకు అబ్జర్వేషన్‌లో ఉంచారు.
చదవండి: టీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు: ఈటల రాజేందర్‌

అదేరోజు మరో గర్భిణికి ఆపరేషన్‌ చేయాల్సి ఉంది. కానీ నిర్లక్ష్యంతో మాలతి పొట్ట కోశారు. బాధితురాలు తాను ఆపరేషన్‌ కోసం రాలేదని మొత్తుకుంది. దీంతో అలర్ట్‌ అయిన వైద్యులు కేస్‌షీట్లు పరిశీలించారు. వేరొకరికి చేయాల్సిన ఆపరేషన్‌ ఈమెకు చేశామని తెలుసుకొని వెంటనే కుట్లు వేసి, తమ పర్యవేక్షణలోనే ఉంచారు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు జూన్‌ 25న డీఎంహెచ్‌వోకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అనంతరం మాలతి పరిస్థితి విషమంగా ఉండటంతో అదే నెల 26న ఆపరేషన్‌ చేయగా పాప మృతిచెందింది. బాబు కేవలం 1,300 గ్రాముల బరువుతో పుట్టాడు. 

కలెక్టర్‌కు ఫిర్యాదుతో విచారణ
మాలతికి ఆపరేషన్‌ తారుమారు ఘటనపై వైద్యాధికారులు స్టాఫ్‌ నర్సును సస్పెండ్‌ చేసి, చేతులు దులుపుకున్నారు. అయితే తగిన న్యాయం జరగకపోవడంతో బాధితులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. కానీ విచారణ చేపడుతున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మాలతి భర్త నరోత్తం రెడ్డి ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పుడు బాబుకు నీలోఫర్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. కానీ వైద్యాధికారులు ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

చిన్నారికి అనారోగ్య సమస్యలు 
కవలల్లో ఒకరు మృతి చెందగా బాబు పుట్టినప్పటి నుంచి రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కావడం లేదని బాధిత కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మాలతి కుటుంబానికి కడుపుకోత మిగిలిందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. 

మరో మహిళకు జరగకూడదు
వైద్యుల నిర్లక్ష్యం వల్ల నాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాప చనిపోయింది. పుట్టిన బాబు ఆరోగ్యంగా లేడు. అధికారులు నీలోఫర్‌లో చూపిస్తామని చెప్పారు. ఇంతవరకు చూపించలేదు. మాతా శిశు కేంద్రంలో మంగళవారం విచారణ జరిపారని తెలిసింది. మాకు సమాచారం లేదు. నాకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదు. 
– మాలతి, బాధితురాలు 

మరిన్ని వార్తలు