తేలని లెక్కలు..వీడని వివాదాలు

4 Jul, 2021 02:26 IST|Sakshi

కృష్ణా నదీజలాల వినియోగంపై వివాదాల పరిష్కారంలో బోర్డు వైఫల్యం 

ఏళ్ల తరబడి పెండింగ్‌లో అనేక సమస్యలు 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్రమవుతున్న జల జగడాలు 

9న త్రిసభ్య కమిటీ భేటీకి ప్రాధాన్యత  

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో కృష్ణా బోర్డు పూర్తిగా విఫలమవుతోంది. దీంతో ఏళ్ల తరబడి సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. జూన్‌  నుంచి ఆరంభమైన కొత్త నీటి సంవత్సరంలో అయినా, కొన్నింటికైనా పరిష్కారం లభిస్తుందని ఆశించినా అడియాశే అవుతోంది. ఒకరు రాసిన లేఖలను మరొకరికి పంపడం, రెండు రాష్ట్రాలు స్పందించకుంటే కేంద్రానికి లేఖలు రాయడం తప్ప, పరిష్కారాలు చూపకపోవడంతో జల జగడాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ఈ నెల 9న హైదరాబాద్‌లో  త్రిసభ్య కమిటీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.  

ముఖ్యమైన సమస్యలివీ..
హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని రాష్ట్ర సర్కార్‌ 2016లో కృష్ణా బోర్డును కోరింది. కృష్ణా బేసి¯Œ  నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80% వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోందని పేర్కొంది. అయితే దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కృష్ణా బోర్డు కోరింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. 

ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీ ఓవర్‌ జలాలను ఎప్పుడైనా వినియోగించుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలంగాణ అంటోంది. 2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను వాడుకోలేకపోయామని, వాటిని 2020–21లో వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–1 తీర్పులో క్లాజ్‌–8 ప్రకారం.. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని, వాడుకోకుండా మిగిలిపోయిన జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కేంద్రం ఇదే వైఖరిని స్పష్టం చేసినా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూడా బోర్డు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. 

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద ప్రవాహ నష్టాలు 40 శాతం మేర ఉన్నాయని తెలంగాణ తొలినుంచీ చెబుతోంది. ప్రవాహ నష్టాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని కోరుతోంది. అయితే ఈ ప్రవాహ నష్టాలు 27 శాతానికి మించవని ఏపీ అంటోంది. ప్రవాహ నష్టాలను తేల్చేందుకు జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆర్నెల్లలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని బోర్డు చెప్పి రెండేళ్లవుతున్నా దీనిపై ఏమీ తేల్చలేదు. 

కృష్ణా బేసిన్‌ లో చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు 90 టీఎంసీల మేర కేటాయింపులున్నా, కేవలం 30 నుంచి 40 టీఎంసీల మేర మాత్రమే వినియోగం ఉంటోందని రాష్ట్రం చెబుతోంది. అయితే ఏపీ మాత్రం మిషన్‌ కాకతీయ కార్యక్రమం అనంతరం తెలంగాణ పూర్తి స్థాయిలో నీటి వినియోగం చేస్తోందని, ఆ నీటి పరిమాణాన్ని సైతం తెలంగాణ నీటి వినియోగం కోటాలో కలపాలని అంటోంది. దీనిపై బోర్డు గతంలోనే జాయింట్‌ కమిటీని నియమించినా నాలుగేళ్లుగా ఈ లెక్కలు తేలలేదు. 

బేసిన్‌ లోని ప్రాజెక్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ కోరుతోంది. 2019–20లో కృష్ణా నదికి భారీ వరద వచ్చి నీరంతా సముద్రంలో కలుస్తున్న సమయంలో ఏపీ 44 టీఎంసీలను మళ్లించింది. ఈ నీటిని రాష్ట్రాల కోటా కింద లెక్కించకూడదని బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. దీనిపై ఇంతవరకు ఎటూ తేలలేదు. 

కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి అందులో ఏయే ప్రాజెక్టులను చేర్చాలన్న దానిపై తర్జనభర్జన కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను గుర్తించినా, న్యాయపరంగా కొన్ని చిక్కులు తప్పవన్న ఉద్దేశంతో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.  

నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద అనవసరంగా విడుదల చేసిన 13.47 టీఎంసీలను తమ వాటా వినియోగంలో చూపరాదని ఆంధ్రప్రదేశ్‌ అంటోంది. ఈ విషయం ఏపీ గతంలో కూడా ప్రస్తావించినా, ఈ వివాదంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. 

ఇక ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలపై పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నా.. బోర్డు వాటికి ఎలాంటి పరిష్కారం తీసుకురాలేకపోతోంది. ఈ విషయాలపై కేంద్రానికి నివేదించడం తప్ప పరిష్కారాలు కనుగొనడం లేదు. 

మరిన్ని వార్తలు