రూ.లక్ష కోట్ల పరిశ్రమగా లైఫ్‌ సైన్సెస్‌ 

4 Nov, 2020 03:06 IST|Sakshi
‘తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ విజన్‌’ నివేదికను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌రంజన్‌ తదితరులు

తెలంగాణను అగ్రశ్రేణి క్లస్టర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం 

2030 నాటికి లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా తెలంగాణ

రాష్ట్ర విధానాలతో లైఫ్‌సైన్సెస్‌ రంగం పురోగతి: మంత్రి కేటీఆర్‌ 

‘తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ విజన్‌–2030’నివేదిక విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 2030 నాటికి ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్లస్టర్‌గా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైఫ్‌ సైన్సెస్‌ అడ్వైజరీ కమిటీ రూపొందించిన ‘తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ విజన్‌–2030’నివేదికను కేటీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో విడుదల చేశారు. తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ కమిటీ చైర్మన్, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ అధిపతి సతీశ్‌రెడ్డితో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు, నిపుణులు, విద్యాసంస్థల అధిపతులు సమావేశంలో పాల్గొన్నారు. నివేదికలోని వివరాలను సతీశ్‌రెడ్డి కేటీఆర్‌కు వివరించారు.

పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నివేదిక ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మానవ వనరులు, సాంకేతిక వసతులు, అత్యుత్తమ మౌలిక వసతులు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు లైఫ్‌ సైన్సెస్‌ రంగం పురోగతికి దారితీసేలా ఉన్నాయని కమిటీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు. 

నివేదికలోని ప్రధానాంశాలు.. 

  • జనాభా సంఖ్య, జీడీపీ వృద్ధిరేటు, ఫార్మా ఎగుమతులు, మెడికల్‌ టూరిజం రంగం వృద్ధి, క్లినికల్‌ ట్రయల్స్‌కు ఉన్న అవకాశాలు రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం అభివృద్ధికి దోహదం చేసేదిగా ఉంది. 
  • జీనోమ్‌ వ్యాలీ, హైదరాబాద్‌ ఫార్మా సిటీ, మెడ్‌ టెక్‌ పార్క్‌ వంటి విద్యా, పరిశోధన సంస్థలు రాష్ట్రంలో ఉండటం కలిసొచ్చే అంశాలు. 
  • రాష్ట్ర జీడీపీలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం వాటా 2016లో రూ.900 కోట్లు కాగా, 2020 నాటికి రూ.1,300 కోట్లకు చేరింది. దీన్ని 2030 నాటికి మూడింతలు చేయాలనేది లైఫ్‌ సైన్సెస్‌ విజన్‌ లక్ష్యం. 
  • దేశీయ ఫార్మా ఎగుమతుల్లో తెలంగాణ వాటా 30 శాతం కాగా, ప్రస్తుతం రాష్ట్రాన్ని వ్యాక్సిన్‌ హబ్‌గా పరిగణిస్తున్నారు. దేశీయ వ్యాక్సిన్‌ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 33 శాతంగా ఉంది. దేశీయ బల్క్‌ డ్రగ్‌ ఎగుమతుల్లో 50 శాతం, బల్క్‌ డ్రగ్‌ తయారీలో 40 శాతం తెలంగాణ నుంచే జరుగుతోంది. 
  • వచ్చే పదేళ్ల పాటు లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ఏటా 15 శాతం వృద్ధిరేటుతో 2030 నాటికి రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, రూ.50 వేల కోట్ల రెవెన్యూ సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలోని 10 ప్రతిష్టాత్మక బహుళ జాతి సంస్థల్లో కనీసం 3 నుంచి 5 సంస్థలను రాష్ట్రానికి రప్పించాలి. 
  • కొత్త ఔషధాలపై పరిశోధన, తయారీ, ఫార్మా, బయో ఫార్మా, మెడికల్‌ డివైజెస్‌ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు, దేశీయ పబ్లిక్‌ హెల్త్‌ డేటా సేకరించి క్లినికల్‌ పరిశోధన పెంచడం ద్వారా లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి ఊతమివ్వడం సాధ్యమవుతుంది. 
  • ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు ఈ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు బయో ఫార్మా హబ్, డయాగ్నస్టిక్‌ హబ్‌(డీ హబ్‌) వంటివి ఏర్పాటు చేయాలి. 
  • లైఫ్‌ సైన్సెస్‌ రంగం తయారీ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, మార్కెటింగ్, పరిశోధనశాలల ఏర్పాటు వంటి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 
  • స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రైవేటు సంస్థల ద్వారా కార్పస్‌ నిధి, పరిశ్రమకు విద్యా సంస్థలకు నడుమ అనుసంధానంతో పాటు లైఫ్‌సైన్సెస్‌ రంగం పరిధిని విస్తరించేందుకు ‘తెలంగాణ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్, సైన్స్, టెక్నాలజీ ఏర్పాటు చేయాలి.  
  • లైఫ్‌ సైన్సెస్‌ సాంకేతికతను విద్యా సంస్థలకు బదిలీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలి. 
  • కొత్త ఔషధాలు, వ్యాక్సిన్ల కోసం రెగ్యులేటరీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. ఫార్ములేషన్, పరిశోధన, అభివృద్ధి కోసం సమీకృత లైఫ్‌ సైన్సెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. 
  • ఈ రంగంలో పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

‘డిజిటల్‌ తెలంగాణ’ నివేదిక విడుదల 
డిజిటల్‌ మీడియా విభాగం రూపొందించిన ‘డిజిటల్‌ తెలంగాణ– డిజిటల్‌ మీడి యా ఫర్‌ ఎఫెక్టివ్‌ డిజిటల్‌ మేనేజ్‌మెంట్‌’నివేదికను మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు