గోదావరి నీళ్లతో మూసీని నింపుతాం

26 Sep, 2023 05:00 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ తదితరులు

ఎస్టీపీలను నిర్మించి మురుగు నీరు కలవకుండా చేస్తాం: కేటీఆర్‌  

మూసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తాం 

మూసీ నది మీదుగా ఓఆర్‌ఆర్‌ వరకు రోడ్డు 

వారం పది రోజుల్లో 40వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేస్తాం 

మూసారంబాగ్‌లో హైలెవెల్‌ బ్రిడ్జికి శంకుస్థాపన 

నాగోలు/అంబర్‌పేట్‌/మన్సూరా­బాద్‌ (హైదరాబాద్‌): మహా నగరంలో ఉన్న చారిత్రక మూసీ నదిని స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో నింపుతామని ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పా­రు. నార్సింగి వద్ద గోదావరి జలాలను మూసీలో కలిపి మురుగు నీ­రు లేకుండా చర్యలు చేపడతామని, దీనికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్టీపీ ప్లాంట్‌లను నిర్మిస్తా­మని తెలిపారు.

హైదరాబాద్‌కు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మూసీని గత ప్రభుత్వాలు పట్టించుకోక మురికి కూపంగా మారిపోయిందన్నారు. సోమవారం రూ.52 కోట్ల అంచనా వ్యయంతో మూసారంబాగ్‌ వద్ద మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన హైలెవెల్‌ బ్రిడ్జికి కేటీఆర్‌ శంకుస్థాపన చేసి మాట్లాడారు.

మూసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, వీటికి అద్భుతమైన డిజైన్లను రూపొందించేందుకు మన ఇంజనీర్లతో విదేశాల్లో అధ్యయనం చేయించామని తెలిపారు. సినిమాల్లో చూపిన మాదిరిగా బ్రిడ్జి డిజైన్లు ఉంటాయని, శంకుస్థాపన చేసిన వంతెనలు 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మురుగునీటి శుద్ధిలో దేశంలోనే హైదారాబాద్‌ మొదటి స్థానంలో ఉందని వివరించారు. ఇప్పుడు రోజుకు 2వేల మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని, ఇవి పూర్తయితే మూసీలోకి పూర్తిస్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్ధితి ఏర్పడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్‌ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ గుప్త, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. 
 
సీఎం కలను నెరవేరుస్తాం  
మంచిరేవుల నుంచి ఘట్‌కేసర్‌ దాకా మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్‌ కలను నెరవేరుస్తామని కేటీఆర్‌ చెప్పారు. 160 కి.మీ. ఓఆర్‌ఆర్‌ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లేలా బ్రిడ్జిలు, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ. 5వేల కోట్లతో రెండో విడత ఎస్‌ఎన్‌డీపీ పనులు త్వరలోనే చేపడతామని తెలిపారు.

వారం పది రోజుల్లో 40 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. జీవో 118లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ పార్కు అద్భుతంగా ఉందని కేటీఆర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి కితాబునిచ్చారు.

కేటీఆర్‌ పార్కు మొత్తం కలియతిరిగి అక్కడ ఏర్పాటుచేసిన ఆకృతులను ఆసక్తిగా తిలకించి.. జీహెచ్‌ఎంసీ కార్మికులతో ఫొటోలు దిగారు. హైదరాబాద్‌ మతసమరస్యానికి ప్రతీక అని, పార్లమెంటులో లేని మతసమరస్యాం మన హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్‌ అన్నారు. గణేశ్‌ నిమజ్జనం పురస్కరించుకొని మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ వాయిదా వేసుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారనే దానికి నిదర్శనమని తెలిపారు.  

మరిన్ని వార్తలు