ఓఆర్‌ఆర్‌.. ఫుల్‌ జిగేల్‌! 

12 Nov, 2020 08:24 IST|Sakshi

ఇప్పటికే గచ్చిబౌలి– శంషాబాద్‌ మార్గంలో ఎల్‌ఈడీ వెలుగులు 

మిగతా 136 కి.మీ పరిధిలోనూ విరజిమ్మేలా ఏర్పాట్లు 

రూ.100 కోట్లతో వివిధ ఏజెన్సీలకు పనుల అప్పగింత 

దీపావళి ముందురోజు నుంచే మొదలుకానున్న పనులు  

రాత్రి సమయాల్లో ప్రమాదాల నియంత్రణపై హెచ్‌ఎండీఏ దృష్టి  

ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పూర్తిగా వెలుగు జిలుగులతో తళుకులీననుంది. రాత్రి సమయాల్లో వాహనదారులు సాఫీ ప్రయాణం చేసే దిశగా హెచ్‌ఎండీఏ వేగిరంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వరకు దాదాపు 24 కిలో మీటర్ల పొడవునా ఎల్‌ఈడీ లైట్లు వెలుగులు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. మిగిలిన 136 కి.మీ మార్గంలోనూ త్వరితగతిన పనులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 13న ఎల్‌ఈడీ బల్బుల బిగింపు పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: నగరానికే తలమానికమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు 158 కి.మీ మేర ఉంది. ఇప్పటికే గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు 24 కి.మీ మేర ఎల్‌ఈడీ బల్బుల వెలుగులు 2018 నుంచి ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లూ మిగిలిన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ బల్బుల వెలుగులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు 0 నుంచి 136 కి.మీ వరకు అంటే కోకాపేట నుంచి కొల్లూరు, పటాన్‌చెరు, దుండిగల్‌ తదితర ప్రాంతాల మీదుగా శంషాబాద్‌ వరకు బిగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే నాలుగు ప్యాకేజీల కింద దాదాపు రూ.107.50 కోట్ల వ్యయంతో ఈ పనులను వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన డిజైనింగ్‌ పనులకు సిద్ధమయ్యారు. దీపావళికి ముందు అధికారికంగా ప్రారంభమయ్యే పనులను దాదాపు ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయనున్నారు. సుమారు 7 వేల స్తంభాలు, 14 వేల ఎల్‌ఈడీ బల్బులను ఇటు ఓఆర్‌ఆర్‌ మెయిన్‌ క్యారేజ్‌ వే, ఇంటర్‌చేంజ్‌లు, జంక్షన్లు, సరీ్వస్‌ రోడ్లు, అండర్‌పాస్‌ల్లో బిగించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఓఆర్‌ఆర్‌ మొత్తంలో ఈ వెలుగుల పనులు పూర్తయితే దేశంలోనే తొలి ప్రాజెక్టు అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఆటోమేటిక్‌ లైటింగ్‌లో కూడా.. 
ఓఆర్‌ఆర్‌పై రాత్రి వేళలో వాహనదారుల కదలికల్ని బట్టి ఈ బల్బుల వెలుగులు ఉంటాయి. వాహనాల రాకపోకలు ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో వెలుగులు ఉండేలా.. అవి లేని సమయాల్లో ఆటోమేటిక్‌ డీమ్‌ అయ్యేలా అధికారులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. రిమోట్‌ నుంచి పనిచేసేలా చేస్తున్న ఈ వ్యవస్థ ద్వారా కూర్చున్న చోట నుంచే అంటే తమ సెల్‌ఫోన్‌ల నుంచే లైట్లు వెలుగుతున్నాయా లేదా.. ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అనే తెలుసుకునే ‘ఆటోమేషన్‌’ ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని ఆశిస్తున్నారు.  

మరిన్ని వార్తలు