కోవిడ్‌ తర్వాత కొత్త నగరాలకు

15 Sep, 2023 03:00 IST|Sakshi

రూట్‌ మారుస్తున్న ఐటీ సంస్థలు.. 26 ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కంపెనీలు

తక్కువ నిర్వహణ వ్యయం, నిపుణుల లభ్యతే కారణం

ప్రథమ శ్రేణి నగరాలతో పోల్చుకుంటే 30 శాతం వరకు తక్కువ వేతనాలు

స్టార్టప్‌ కంపెనీల చూపూ ఈ నగరాల వైపే..

2022లో 39 శాతం టెక్‌ స్టార్టప్‌లు ఇక్కడే ఏర్పాటు

డెలాయిట్, నాస్కామ్‌ సంయుక్త అధ్యయనం వెల్లడి

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌  
ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఒకప్పుడు ఇవే దేశంలో ప్రధాన ఐటీ హబ్‌లు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది. ఐటీ కంపెనీలు రూటు మారు స్తున్నాయి. చండీగఢ్, మంగళూరు, అహ్మదా బాద్, కాన్పూర్, తిరువనంతపురం, భోపా ల్, జైపూర్, వరంగల్, విశాఖపట్నం,విజయ వాడ లాంటి నగరాలు తెరపైకి వస్తున్నాయి. 

  • కోవిడ్‌కు దేశంలోని కేవలం ఏడు ప్రధాన నగరాలకే పరిమితమైన సమాచార సాంకేతిక రంగం.. కోవిడ్‌ తదనంతర పరిణా మాల నేపథ్యంలో దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బహుళజాతి సంస్థలు నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవాలని భావి స్తుండటమే ఇందుకు కారణమని ఐటీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నగరాల్లోనే 11–15% నైపుణ్యం ఉన్న యువత
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే 11–15 శాతం సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత ఉన్నట్లు ఐటీ కంపెనీలు గుర్తించాయి. దాదాపు 60 శాతం పట్టభద్రులు ఈ పట్టణాల నుంచే ఉత్తీర్ణులు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉత్తీర్ణులయ్యే వారిలో 30 శాతం మేరకు ఉద్యోగాల కోసం ప్రథమ శ్రేణి నగరాలకు తరలి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల వైపు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

స్టార్టప్‌లు ఎక్కువగా ఇక్కడే..
2022లో దాదాపు 7 వేల (39%) స్టార్టప్‌లు ఈ కొత్త నగరాల నుంచే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 13 శాతం స్టార్టప్‌ కంపె నీల ఫండింగ్‌ ఈ ద్వితీయ శ్రేణి నగరాలకే వెళ్లినట్లు తెలిపింది. పెట్టుబ డిదారులు కూడా ప్రథమ శ్రేణి నగరాల్లోని వాటికంటే ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికే ముందుకు వస్తున్నట్లుగా అధ్యయనంలో తేలినట్లు నివేదిక పేర్కొంది.

కొత్త హబ్‌లు ఎక్కడెక్కడ?
దేశంలోని ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాలైన టువంటి చండీగఢ్, నాగ్‌పూర్, అహ్మదా బాద్, మంగళూరు, కాన్పూర్, తిరువనంతపుర, లఖ్‌నవూ, గౌహతి, రాంచీ, భోపాల్, జైపూర్, ఇండోర్, నాసిక్, భువనేశ్వర్, రాయ్‌పూర్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, హుబ్బళి, విజయవాడ, తిరు పతి, మైసూరు, వెల్లూరు, మధురై, తిరుచిరా పల్లి, కొచ్చి నగరాలపై ఐటీ సంస్థలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. 

తెలంగాణలోని పలు నగరాల్లో హబ్‌లు
ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లాలని 2015–16 నుంచే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లు నిర్మించారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్‌లలో ఐటీ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే నల్లగొండ, రామగుండంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయ బోతున్నారు. మొత్తం మీద 2026 నాటికి 20 వేల మందికి నేరుగా ఈ పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వికేంద్రీకరణతో సానుకూల మార్పులు
ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం ప్రధాన నగరాలు, పట్టణాలకు పరిమితం కాకుండా రెండో, మూడో శ్రేణి నగరాలు, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ వల్ల చాలా సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కోవిడ్‌ తర్వాత చాలావరకు ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నా మంచి ఉత్పాదకత వస్తుండటంతో కంపెనీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. నిర్వహణ వ్యయం మరింత తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి  మరోవైపు వికేంద్రీకరణ కారణంగా ఉద్యోగులకు కూడా ఇళ్ల అద్దెలు, ప్రయాణ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో వికేంద్రీకరణ మరింత జరిగి శాటిలైట్‌ సెంటర్ల ద్వారా చిన్న చిన్న హబ్‌లు కూడా ఏర్పడబోతున్నాయి. ఇంటర్నెట్‌ స్పీడ్, నిరంతర కరెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే గ్రామస్థాయి వరకు కూడా తీసుకెళ్లే అవకాశాలుంటాయి.    – వెంకారెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్, సీనియర్‌ హెచ్‌ఆర్‌ లీడర్, కో ఫోర్జ్‌

ప్రత్యామ్నాయ హబ్‌లు అత్యంత ఆవశ్యకం
దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఏ విధంగా ఐటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్న అంశంపై డెలాయిట్, నాస్కామ్‌ సంయుక్తంగా ఓ అధ్యయనం నిర్వహించి నివేదికను తయారు చేశాయి. ‘ఎమర్జింగ్‌ టెక్నాలజీ హబ్స్‌ ఇన్‌ ఇండియా’ పేరిట ఇది రూపొందింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ప్రస్తుతం మరో 26 నగరాలకు విస్తరించిందని ఆ నివేదిక వెల్లడించింది.

ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు నాస్కామ్‌ అధిపతి సుకన్యరాయ్‌ తెలిపారు.కాగా ఆయా ప్రాంతాల్లో విస్తరించడానికి గల కారణాలను, అక్కడ ఉన్న అవకాశాలను, ఇతర అంశాలను వివరించింది. ఏడు ప్రధాన నగరాల్లో విస్తరించిన ఐటీ రంగంలో దాదాపు 54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.

అయితే నైపుణ్యం, నిర్వహణ వ్యయం, కొత్త నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి వారు ఉన్నచోటే  ఉపాధి కల్పించేలా ఆ ప్రాంతాల్లోనే కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని ఐటీ సంస్థలు భావిస్తున్నాయని నివేదిక చెబుతోంది. కోవిడ్‌ తరువాత ఈ వికేంద్రీకరణ వేగం పుంజుకుందని తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలకు ప్రత్యామ్నాయంగా ఐటీ హబ్‌ల ఏర్పాటు అత్యంత ఆవశ్యకమని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు నాస్కామ్, డెలాయిట్‌ స్పష్టం చేశాయి.

2030 నాటికి నైపుణ్యం మిగులు..
దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐటీ నిపుణుల కంటే డిమాండ్‌ ఎక్కువగా ఉందని  అంచనా వేశారు. అయితే 2030 నాటికి ఈ పరిస్థితి మారుతుందని, డిమాండ్‌ కంటే అధికంగా ఐటీ నిపుణులు ఉంటారని సుకన్యరాయ్‌ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటు వల్ల గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ రంగం వైపు మళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేలా తగిన మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావడం ఐటీ రంగానికి కలిసివచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

మౌలిక వసతుల కల్పనతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని, మరోవైపు భవనాల కోసం చెల్లించే అద్దె కానీ, సొంత భవనాల నిర్మాణ వ్యయం కానీ ప్రధాన నగరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎమర్జింగ్‌ సిటీస్‌ (కొత్త నగరాలు)లో 25 నుంచి 30 శాతం వరకు తక్కువ వేతనాలకే నిపుణులు లభిస్తుండటం, 50 శాతం వరకు తక్కువకు అద్దెకు భవనాలు లభించడం వంటి అనుకూల పరిణామాలు ఐటీ రంగం వికేంద్రీకరణకు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది.

మరిన్ని వార్తలు