పాలమూరు.. పచ్చదనానికి విశ్వవేదిక

21 Aug, 2021 02:43 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం  గిన్నీస్‌బుక్‌ రికార్డు జ్ఞాపికను సీఎం చేతుల మీదుగా అందుకున్న ఎంపీ సంతోష్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: సమైక్యపాలనలో వలసలకు, ఆకలిచావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయంపాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. హరితహారం స్ఫూర్తితో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సీడ్‌బాల్స్‌ను రికార్డుస్థాయిలో తయారు చేసి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా వెదజల్లడం, సీడ్‌బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డు జ్ఞాపికను శుక్రవారం ప్రగతిభన్‌లో సీఎం చేతుల మీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్‌ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందుకున్నారు.

ఈ సందర్భంగా వారి కృషిని సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న జలాలతో జిల్లావ్యాప్తంగా పచ్చనిపంటలు కనువిందు చేస్తున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. బీడుభూములు, రాళ్లు, గుట్టలకే ఇన్నాళ్లూ పరిమితమైన పాలమూరు పచ్చదనంతో రూపురేఖలను మార్చుకుని, వినూత్నరీతిలో అభివృద్ధిపథంలో ముందుకు దూసుకుపోతుండటం గర్వకారణమన్నారు. తక్కువఖర్చుతో ఎక్కువ పచ్చదనాన్ని సాధించేదిశగా రికార్డుస్థాయిలో 2 కోట్ల పది లక్షల సీడ్‌బాల్స్‌ను నెలరోజుల వ్యవధిలో తయారు చేసి 10 రోజుల్లో కొండలు, గుట్టల ప్రాంతాల్లో వెదజల్లిన జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని అభినందించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు