‘రోడ్డెందుకు సన్నబడింది’పై...సమగ్ర దర్యాప్తు షురూ

26 Mar, 2021 03:14 IST|Sakshi
రోడ్డు కొలతలు తీసుకుంటున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, సిబ్బంది

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన

దాదాపు 54 నుంచి 64 అడుగుల వరకు భవనం రోడ్డుపైకి వచ్చినట్టుగా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ‘రోడ్డెందుకు సన్నబడింది!’ అనే శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కథనంపై స్పందించిన పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు.. ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి/ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో హెచ్‌ఎండీఏ, స్థానిక మున్సిపల్‌ అధికారులు.. గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నార్సింగి నుంచి పుప్పాల్‌గూడ వరకు నిర్మాణంలో ఉన్న 100 ఫీట్ల రోడ్డుకు అడ్డంగా అపార్ట్‌మెంట్‌ ఉన్నచోట (అల్కాపురి టౌన్‌షిప్‌లో) కొలతలు తీశారు. బహుళ అంతస్తుల భవనం దాదాపు 54 నుంచి 64 అడుగుల వరకు రోడ్డు స్థలంలోకి చొచ్చుకొచ్చినట్లు తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు హెచ్‌ఎండీఎ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.   

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌.. ట్వీట్ల జోరు 
సాక్షిలో వచ్చిన రోడ్డెందుకు సన్నబడింది కథనం క్లిప్పింగ్‌లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. మణికొండ, అల్కపూర్, పుప్పాలగూడ, నార్సింగి, సెక్రటరీ కాలనీ, నెక్నాంపూర్‌తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానికులు ఏకంగా మంత్రి కేటీఆర్‌కు వాట్సాప్‌ ద్వారా క్లిప్పింగ్‌లు పంపి ఫిర్యాదు చేశారు. మరికొందరు ఈ క్లిప్పింగ్స్‌ను ట్వీట్‌ చేసి మంత్రి కేటీఆర్‌తో పాటు సీఎంవో, హెచ్‌ఎండీఏ, వివిధ ప్రభుత్వ విభాగాలకు ట్యాగ్‌ చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక తెప్పించుకుంటానని కొంతమంది వాట్సాప్‌లకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు.

100 అడుగుల రోడ్డు వేయాల్సిందే
మణికొండ, నార్సింగి ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండే ఈ వంద ఫీట్ల రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని త్వరలోనే హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ శాఖ అధికారులతో చర్చిస్తాను. రోడ్డును పూర్తిస్థాయిలో వంద అడుగుల వెడల్పుతో నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాను. 
– ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌  

>
మరిన్ని వార్తలు