మావోయిస్టు పార్టీ: పట్టుకోసం ప్రయత్నాలు!

29 Nov, 2020 13:15 IST|Sakshi

2 నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు!

ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్‌ ముమ్మరం 

రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ల కోసం మావోల ప్రయత్నాలు 

చురుగ్గా పనిచేస్తున్న మావోయిస్టు కమిటీలు  

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటై 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఏటా నిర్వహించే వారోత్సవాలకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్‌ 2 నుంచి 8 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. 2000లో సీపీఐ (ఎంఎల్‌), పీపుల్స్‌వార్‌ తదితర విప్లవ పార్టీలన్నీ కలసి ఒకే గూటికిందకొచ్చి సీపీఐ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇలా కలసిపోయిన అన్ని పార్టీల్లోని సాయుధ దళాలన్నిటిని కలిపి పీఎల్‌జీఏగా ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణలోని ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరుసగా చోటుచేసుకున్న ఐదు ఎన్‌కౌంటర్లలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం, కొత్తవారిని చేర్చుకోవడానికి పీఎల్‌జీఏ వారోత్సవాలను తెలంగాణ జిల్లాల్లో నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

గత జూలైలో తెలంగాణలో కొత్తగా రాష్ట్ర కమిటీతోపాటు 12 డివిజన్, ఏరియా కమిటీలు వేశాక వారోత్సవాలు జరుగుతుండటంతో రిక్రూట్‌మెంట్లపై మావోయిస్టు పార్టీ గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త కమిటీలన్నీ చురుగ్గా పని చేస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు సైతం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్‌ సైతం ఏవోబీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆయా రాష్ట్రాలు, కేంద్ర బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల ఎస్పీలు ఆయా జిల్లాల్లోని అన్ని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఏజె న్సీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కొరియర్లు, సానుభూతిపరులపై కూడా మరింత నిఘా పెట్టారు. 

రాష్ట్రంలోనూ హత్యలు     
గత అక్టోబర్‌ 10న ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు మడూరి భీమేశ్వరరావును మావోలు హతమార్చారు. అలాగే అక్టోబర్‌ 26న ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన నాయకులపు ఈశ్వర్‌ అనే వ్యక్తిని మావోయిస్టులు పోలీసు ఇన్‌ఫార్మర్‌ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో హతమార్చారు. అలాగే 2019, జూలై 8న చర్ల మండలం బెస్తకొత్తూరు టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును అపహరించిన మావోయిస్టులు అదేనెల 12వ తేదీన హత్య చేశారు.  

పట్టుకోసం ప్రయత్నాలు..  
మూడేళ్లుగా మావోయిస్టులు సరిహద్దు ఏజెన్సీలో తిరిగి పట్టు సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పలుచోట్ల భారీగా మందుపాతరలు, ప్రెషర్‌బాంబులు అమర్చారు. మరోవైపు మావోల యాక్షన్‌ టీమ్‌లు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. పోలీసు బలగాలతో ఎదురుకాల్పులు నిత్యకృత్యమయ్యాయి. మరో పక్క ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పలువురిని హతమార్చింది. గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని రెండు గ్రామాలకు చెందిన 25 మందిని అపహరించిన మావోలు ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి వారిని హతమార్చారు. 

మరిన్ని వార్తలు