మవోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?!

1 Sep, 2020 11:49 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్న ఆయన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా, 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ గ్రామం.

ఇక ఎంపీసీ, నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత కేంద్ర కార్యదర్శిగా గణపతి పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018 లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య సమస్యలతో సతమవుతున్న గణపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లొంగుబాటుకు సిద్ధమవుతారని గత రాత్రి నుంచి కరీంనగర్‌​ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన లొంగుబాటు నిజమే అయితే విప్లవోద్యమ చరిత్రలో పెద్ద కుదుపుగానే భావించాలి. మరోవైపు గణపతితోపాటు మరో నలుగురు మవోయిస్టు నేతలు కూడా లొంగుబాటు దిశగా పయనిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
(చదవండి: మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!)

మరిన్ని వార్తలు