తుది ఉత్తర్వుల మేరకే ఎంబీబీఎస్‌ సీట్లు

13 Jul, 2023 01:53 IST|Sakshi

పిటిషనర్లూ దరఖాస్తు చేసుకోవచ్చు

ఏపీ విద్యార్థులకు తెలంగాణలో రిజర్వేషన్‌ ఎలా ఇస్తారన్న హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త మెడికల్‌ కాలేజీల్లో రిజర్వేషన్ల అంశంపై తుది తీర్పునకు లోబడే సీట్ల కేటాయింపు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే వారి సర్టిఫి కెట్లను వెరిఫికేషన్‌ చేయించాలని అధికారులకు చెప్పింది. విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు తెలంగాణలో రిజర్వేషన్‌ ఎలా ఇస్తారని న్యాయ స్థానం సందేహం వ్యక్తం చేసింది. పూర్తి వాదనలు విన్న తర్వాత తేలుస్తామని చెప్పింది.

కొత్త మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్‌ సీట్లను తెలంగాణ విద్యార్థుల కే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జూలై 3న ఇచ్చిన జీవో 72ను కొట్టివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తెలంగాణ వైద్య కళాశాలల అడ్మిషన్‌ నిబంధనలకు సవరణ చేస్తూ ప్రభుత్వం వారం కిత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ప్రకారం 2014, జూన్‌ 2 తర్వాత ఏర్పాటైన మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్‌ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌ కానున్నాయి. అంతకుముందు 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్‌రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా పోటీ పడేవారు.

తాజా జీవోతో ఏపీ విద్యార్థులకు పోటీపడే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన పి.సాయిసిరిలోచనతో పాటు మరో ఇద్దరు తెలంగాణ హైకోర్టులో పిటిష న్లు దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకో ర్టు విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు