సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ!

11 Dec, 2023 04:38 IST|Sakshi

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

అధికారులు, ఫ్యాకల్టీతో భేటీ.. సంస్థ కార్యకలాపాల గురించి వాకబు 

ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని సొంతింట్లోనే సీఎం.. ప్రజాభవన్‌ వినియోగానికి విముఖత 

సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీకి తరలించే యోచన..  అదే జరిగితే అక్కడి శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు మార్చే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) సందర్శించారు. అక్కడి బోధన సిబ్బందితో సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాల గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డీజీ డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ సంస్థ కార్యకలాపాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రేవంత్‌కు వివరించారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను రేవంత్‌రెడ్డి సోలార్‌ పవర్‌ వాహనంలో కలియతిరుగుతూ పరిశీలించారు. సీఎం వెంట రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. 

ప్రగతిభవన్‌ రాచరికానికి చిహ్నంగా ఉందంటూ గతంలో విమర్శలు.. 
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనాన్ని సందర్శించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో గెలవడంతో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్‌.. తన క్యాంపు కార్యాలయంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌ను వినియోగించడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంట్లోనే రేవంత్‌ నివాసముంటున్నారు.

రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్‌ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్‌.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్‌ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.   

>
మరిన్ని వార్తలు