కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి... అసెంబ్లీకి రావాలి

11 Dec, 2023 05:18 IST|Sakshi
ఆస్పత్రిలో కేసీఆర్‌ ఆరోగ్య వివరాలను కేటీఆర్, కవితలను అడిగి తెలుసుకున్న వీహెచ్, కోదండరెడ్డి. చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు

కేసీఆర్‌ను పరామర్శించిన రేవంత్‌ 

సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లి కలసిన సీఎం 

ఆరోగ్య పరిస్థితిపై ఆరా..అసెంబ్లీకి రావాలని ఆకాంక్ష 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకుని శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలసి హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌.. కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

అక్కడే ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులతోనూ మాట్లాడారు. తర్వాత ఆస్పత్రి బయట రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను పరామర్శించాను. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నా. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడాల్సిన అవసరముంది. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నా..’’అని రేవంత్‌ అన్నారు. 

కేటీఆర్, హరీశ్‌లను కలసిన పొన్నం 
మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చానని.. అక్కడే ఉన్న కేసీఆర్‌ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడానని పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కేసీఆర్‌ త్వర గా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. 

కేసీఆర్‌కు వీహెచ్, కోదండరెడ్డి పరామర్శ 
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, కోదండరెడ్డి పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన ఇద్దరు నేతలు కేసీఆర్‌ను కలిశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొలుత కేసీఆర్‌ను కలిసేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతించకపోవడంతో.. మాజీ మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్‌ నేతలను లోపలికి తీసుకెళ్లారు.   

మరో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్‌ డిశ్చార్జ్‌? 
సాధారణంగా తుంటి మారి్పడి సర్జరీ చేయించుకున్న అనంతరం రెండు రోజుల్లోనే డిశ్చార్జ్‌ చేస్తారు. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ డిశ్చార్జిని కొద్దిగా పొడిగించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన బాగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ మందుల వాడకం, సులభమైన వ్యాయామాలు తప్ప మరే ప్రత్యేకమైన వైద్య సేవలూ అవసరం లేదని అంటున్నారు. దీంతో ఆయనను మరో 2, 3 రోజుల్లోనే డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పూర్తిగా కోలుకుని తన కార్యకలాపాలు య «థావిధిగా నిర్వర్తించేందుకు మరి కొన్ని వారా లు పడుతుందని వైద్యులు అంటున్నారు. 

>
మరిన్ని వార్తలు