త్వరలో 8 మెడికల్‌ కాలేజీలకు దరఖాస్తు

30 Aug, 2021 03:14 IST|Sakshi

జాతీయ వైద్య కమిషన్‌కు దరఖాస్తు చేసేందుకు కసరత్తు 

వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు వైద్య ఆరోగ్యశాఖ వచ్చే నెల 20 తర్వాత దరఖాస్తు చేయనుంది. ఆ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌ కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాలలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రామగుండంలో ఏర్పాటు చేసే సింగరేణి మెడికల్‌ కాలేజీకి కూడా త్వరలోనే అనుమతి వచ్చే అవకాశాలున్నాయి. దీనికీ అనుమతులు రాగానే మొత్తం ఎనిమిది కళాశాలలకు ఒకేసారి ఆన్‌లైన్‌లో జాతీయ వైద్య కమిషన్‌కు దరఖాస్తు చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తుంది.

అందుకు సంబంధించి ఉన్నతస్థాయిలో సమీక్ష జరిగింది. వచ్చే నెల 26 వరకు దరఖాస్తుకు గడువు ఉండటంతో ఆలోపు చేయాలని భావిస్తున్నారు. మెడికల్‌ కాలేజీకి కేంద్రం నుంచి అనుమతి రావాలంటే వాటికి అనుబంధంగా కచ్చితంగా 300 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలి. అయితే కొన్నింటికి వందా రెండొందలు మాత్రమే పడకలున్నాయి. దీంతో తక్కువ ఉన్న వాటికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

ప్రస్తుత ఆసుపత్రి భవనాల్లోనే పైభాగంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేబొరేటరీలు, వైద్యపరికరాలు, ఫర్నీచర్‌ కొనుగోలుకు టెండరు ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని టెండర్‌ ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రానికి దరఖాస్తు చేశాక అక్కడి నుంచి ఉన్నతస్థాయి తనిఖీ బృందం ఏడాది చివరికల్లా రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. వారు తనిఖీలకు వచ్చేనాటికి ఒక్కో మెడికల్‌ కాలేజీలో 97 మంది పోస్టులను భర్తీ చేయాలి. నూతన నియామకాలను ఈసారి అఖిల భారత స్థాయిలో చేపట్టాలని నిర్ణయించారు.   

మరిన్ని వార్తలు