ఆన్‌లైన్‌లో వైద్య సిబ్బంది వేతనాలు

1 Jul, 2022 03:12 IST|Sakshi

వైద్య విద్యార్థుల స్టైఫండ్‌ చెల్లింపుల్లో ఆలస్యానికీ చెక్‌ 

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్య శాఖలో హౌస్‌ సర్జన్లు, జూనియర్‌ డాక్టర్లు, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు స్టైఫండ్‌తోపాటు డైట్, పారిశుద్ధ్య, ఇతర కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, నర్సుల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు మాన్యువల్‌ బిల్లుల విధా నంద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో కొంత ఆలస్యమవుతోంది.

బిల్లులను స్క్రూటినీ చేయడం, ఉన్నతాధికారులకు పంపడం, ప్రభుత్వం ఆమోదం తీసుకోవడం లాంటి పద్ధతుల వల్ల జాప్యం జరుగు తున్నట్లు గుర్తించారు. దీన్ని నివారించేందుకు ఆన్‌లైన్‌ విధానంలో చెల్లింపులు చేయాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌ వేర్‌ రూపొందించాలని సూచించారు.

వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిష నర్‌ శ్వేత మహంతి, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ సంబంధిత అధికారులతో గురువారం బీఆర్‌కే భవన్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది,  హౌస్‌ సర్జ న్లు, జూనియర్, సీనియర్‌ రెసిడెంట్ల వేత నాల చెల్లింపులో  ఆలస్యం జరగ కూడదని ఆదేశించారు. 

వైద్యులకు సెల్యూట్‌..
ఈ భూమిపై ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శక్తి వైద్యులకు మాత్రమే ఉందని, అందుకే వాళ్లు మనకు కనిపించే దేవుళ్లు అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.  కోవిడ్‌ మహమ్మారి సమయంలో వైద్యసిబ్బంది చూపిన తెగువను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. దీనికి ‘థ్యాంక్యూ డాక్టర్‌’అని చెబితే సరిపోదని, వారి త్యాగాలను గౌరవించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు