కాంగ్రెస్‌ నేతలవి పిచ్చి మాటలు

13 Aug, 2023 06:34 IST|Sakshi

లేవనెత్తే సమస్యల్లేక ఏం చేయాలో తెలుస్తలేదు

సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కాంగ్రెస్‌ నాయకులు వీఆర్‌ఏలను, పంచాయతీ కార్యదర్శులను రెచ్చగొట్టాలని చూశారు.. కానీ వారిని రెగ్యులరైజ్‌ చేశాము.. రేషన్‌డీలర్ల సమస్యనూ పరిష్కరించాం.. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్, ఇంటింటికీ మంచినీరు వంటి పథకాలతో మహిళలు సీఎం కేసీఆర్‌కు జైకొడుతున్నారు.. ఇక ఏం చేయాలో తెలియక  కాంగ్రెస్‌ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారు’’  అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన బీసీ బంధు లబ్ధిదారులకు రూ.లక్ష సాయం పంపిణీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారానికి సంబంధించిన డబ్బులను బ్యాంకు వెబ్‌సైట్లపై స్వయంగా మీట నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయించారు. అనంతరం హరీశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌ సభలకు ప్రజలు రాకపోవడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదన్నారు. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌ నాయకులు తిరిగి బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తారా అని నిలదీశారు.

రైతులే తేల్చుకోవాలి..
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్‌ సరిపోతుందన్న కాంగ్రెస్‌ కావాలో.. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీ కావాలో.. మూడు పంటలు పండించేలా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ కావాలో రైతులే తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్‌ పార్టీనే అని, ఆ ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి విద్యుత్‌ సరఫరా అయ్యేదని, ఎరువుల బస్తాల కోసం పోలీస్‌స్టేషన్లలో క్యూలైన్‌లో నిలబడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. 

కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి..
కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు రావాల్సిన రూ.35 వేల కోట్లు నిలిపివేసిందని, ఆ నిధులను కేంద్రం ఎందుకు ఆపిందో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, రాష్ట్ర హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతా ప్రభాకర్, కలెక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు