9 నుంచి 5 వరకు డ్యూటీలో ఉండాలి

6 Apr, 2022 02:04 IST|Sakshi

అత్యవసర సేవలను అన్ని వేళలా అందించాలి: మంత్రి హరీశ్‌రావు 

కుక్క, పాము కాటుకు మందుల్లేక వైద్యం అందకపోతే చర్యలు 

మందుల కోసం బయటకు రాసినా చర్యలు తప్పవు 

పీహెచ్‌సీల వారీగా పనితీరుపై మంత్రి టెలి కాన్ఫరెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రతి ఒక్క వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. 24 గంటలు నడిచే పీహెచ్‌సీలు అత్యవసర సేవలను అన్ని వేళల్లో అందించాలని చెప్పారు. పాము, కుక్క కాటు మందులు పీహెచ్‌సీల్లో ఉండాలని.. మందుల్లేక వైద్యం అందలేదని ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటు లో ఉండేలా చూసుకోవాలని, మందుల కోసం బయటికి రాస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమీకృత ఆరోగ్య సమాచార వ్యవస్థలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్‌ చేయాలని.. టి–డయాగ్నొస్టిక్‌ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వోలు ఆకస్మిక తనిఖీలు చేసి పనితీరును పరిశీలించాలని ఆదేశించారు. పీహెచ్‌సీల పనితీరుపై మంగళవారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందితో మంత్రి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  

పీహెచ్‌సీలు ముఖ్యం 
ప్రజారోగ్య రక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) పాత్ర ప్రధానమైనదని మంత్రి అన్నారు. ప్రాథమిక స్థాయిలో వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు రాకుండా ప్రజలను కాపాడొచ్చని చెప్పారు. పీహెచ్‌సీ స్థాయికి ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ఇందుకు అనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు ఎన్‌రోల్‌ చేసుకోవాలని మంత్రి సూచించారు. సాధారణ ప్రసవాలు పెంచాలని.. వైద్యులకు, నర్సులకు ప్రోత్సాహాకాలు ఇస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఉండి సేవలు అందిస్తున్న వైద్యులకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 30% ఇన్‌ సర్వీస్‌ కోటా కల్పించామని చెప్పారు.  

పీహెచ్‌సీల స్థానంలో కొత్త నిర్మాణాలు 
పాత పీహెచ్‌సీల స్థానంలో అవసరమైతే కొత్త నిర్మాణాలు చేపడతామని, మరమ్మతులు అవసరమున్న వాటిల్లో వెంటనే పనులు మొదలు పెడతామని, అందుకు నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. డీఎంహెచ్‌వోలు, డిప్యూ టీ డీఎంహెచ్‌వోలు, ఇంజనీర్లు పరిశీలించి వారంలో ప్రతిపాదనలు పంపాలన్నారు. టెలి మెడిసిన్‌ విధానాన్ని  విస్తృతంగా వినియోగించుకొవాలని చెప్పారు.    

మరిన్ని వార్తలు