ఆహారం కల్తీ చేస్తే కఠినచర్యలు

12 Feb, 2022 04:24 IST|Sakshi
మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

అందుబాటులోకి మొబైల్‌ ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌ వాహనాలు: మంత్రి హరీశ్‌

మల్లాపూర్‌ (హైదరాబాద్‌): ఆహారకల్తీ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్టవ్యాప్తంగా నాలుగు మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌ వాహనాలను ప్రవేశపెట్టినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ నాచారంలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం) ఫుడ్‌ లేబొలేటరీ ఆవరణలో మంత్రి హరీశ్, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఆహారంతోపాటు పాలు, నెయ్యి, పండ్లు తదితర వస్తువులలో కల్తీ జరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఈ వాహనాలను కేటాయించినట్లు చెప్పారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న వైద్యపరికరాలు సరిగాలేక కల్తీ ఫలితాలను తొందరగా రాబట్టలేకపోతుండటంతో నాచారంలో రూ.10 కోట్లతో అత్యాధునిక సాంకేతిక ల్యాబ్‌ను ప్రారంభించుకున్నామని వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల సంఖ్య కూడా పెంచామన్నారు. కల్తీ చేసివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఎవరైనా కల్తీ చేస్తే 040 – 21111111కు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కల్తీ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రిజ్వీ, అడిషనల్‌ డైరెక్టర్‌ శివలీల, ఏవో కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు