సాగర్‌ ఎడమ కాల్వకు నీరు 

29 Jul, 2022 01:38 IST|Sakshi
కృష్ణమ్మకు వాయినమిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి , ఎమ్మెల్యేలు  

స్విచ్‌ ఆన్‌చేసి విడుదల చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి 

నాగార్జునసాగర్‌: రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం ఎమ్మెల్యేలు నోముల భగత్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, అధికారులతో కలసి నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అంతకుముందు హెడ్‌రెగ్యులేటర్‌ అంతర్భాగంలో గల స్విచ్‌బోర్డు వద్ద మంత్రి పూజలు చేశారు. నీటిని విడుదల చేసిన అనంతరం కృష్ణమ్మకు వాయినమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణాజలాల వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోందన్నారు.

దీంతో ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరందుతోందని తెలిపారు. 2 దశాబ్దాల కాలంలో జూలైలో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముందస్తుగా నీటిని విడుదల చే యడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎడమ కాల్వ పరిధిలో 6.16 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రణాళికలు రచించినట్లు వివరించారు. దీని ప్రకారం ఎడమ కాల్వ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌సింగ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు