TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ.. బీజేపీ నేతల తీరుపై అనుమానాలు: కేటీఆర్‌

18 Mar, 2023 13:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టీఎస్‌పీఎస్‌సీ లీకేజ్‌ అంశం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. తప్పులు జరిగినప్పుడు ఎలా సరిదిద్దుకోవాలనే బాధ్యత తమపై ఉందన్నారు. అవకతవకలు జరిగాయనే ఇంటర్వ్యూలు రద్దు చేశామని పేర్కొన్నారు.

టీఎస్‌పీఎస్‌సీలో గత ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు చేశామని కేటీఆర్‌ తెలిపారు. వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభించామని, ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. 155 నోటీఫికేషన్‌ల ద్వారా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. యూపీఎస్‌సీ ఛైర్మన్‌ రెండుసార్లు వచ్చిన మన సంస్కరణలు అధ్యయనం చేశారని గుర్తు చేశారు. 13 రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్లు వచ్చి పరిశీలించారని ప్రస్తావించారు. 

‘పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాం. ప్రజలకు నిజానిజాలు తెలియాలని సీఎం కేసీఆర్‌  చెప్పారు. సీఎం ఆదేశాలతోనే సమీక్ష నిర్వహించాం. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ వెనక ఎవరున్న కఠినంగా శిక్షిస్తాం. రద్దైన నాలుగు పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేసుకున్న వారంతా అర్హులే. మొత్తం నాలుగు పరీక్షల కోచింగ్‌ మెటీరియల్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతాం. 2 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది.

తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం. యువత విషయంలో రాజకీయాలు చేయవద్దు. ఇద్దరు చేసిన తప్పును యువతలో అశాంతి చెలరేగేలా కొందరు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు నోటికొచ్చిన్నట్లు మాట్లాడటం సరికాదు. రాజకీయ నిరుద్యోగులు చేసే విమర్శలకు యువత రెచ్చిపోవద్దు. బీజేపీ నేతల తీరుపై అనుమానాలున్నాయి. నిందితుల్లో ఒకడైన రాజశేఖర్‌ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. 

పేపర్‌ లీకేజీలో కుట్ర కోణం ఏదైనా ఉందా అనే అనుమానాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. సిట్‌ విచారణపై నమ్మకం లేదని ముందే అంటే ఎలా. ఇంటర్‌ బోర్డు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఏదైనా జరిగే ఐటీ మంత్రి రాజీనామా చేయాలంటున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పేపర్లు లీకైతే మంత్రులు రాజీనామా చేస్తారా?’ అంటూ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.
చదవండి: మహిళా కమిషన్‌ ముందుకు బండి సంజయ్‌

మరిన్ని వార్తలు