నిర్వాసితులకు ఇచ్చేందుకు నిధుల్లేవా? 

25 Dec, 2022 02:09 IST|Sakshi
నిర్వాసితులకు సంఘీభావం తెలుపుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి 

‘బస్వాపూర్‌’నిర్వాసితుల దీక్షకు సంఘీభావం 

భువనగిరి: బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల నిర్వాసితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపురం గ్రామస్తులు పరిహారం కోసం ప్రాజెక్టు కట్టపై చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 26వ రోజుకు చేరాయి.

ఈ సందర్భంగా వారి దీక్షాశిబిరాన్ని ఎంపీ వెంకట్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇచ్చారు..? బస్వాపూర్‌ నిర్వాసితులకు ఎంత చెల్లిస్తున్నారో చె ప్పాలన్నారు. వాస్తు బాగోలేదని రూ.650 కోట్లు ఖ ర్చు చేసి సచివాలయం నిర్మిస్తున్న ప్రభుత్వం వద్ద నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ మంచి మనసుతో నిర్వాసితులకు రూ.350 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. బస్వాపూర్‌ ప్రాజెక్టు పేరుతో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మూసీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. బస్వాపూర్‌ నిర్వాసితులకు కొత్త అవార్డు ప్రకటించాలని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. పరిహారంపై హామీ ఇవ్వని పక్షంలో ఈ నెల 27న రిజర్వాయర్‌ కట్టపై వంటావార్పు చేపడతామని, అందులో తాను పాల్గొంటానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పలువురు నిర్వాసితులు కంటతడి పెట్టడంతో వారిని ఆయన ఓదార్చారు.  

మరిన్ని వార్తలు