కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో కోసం పోరాడతా: ఆర్‌.కృష్ణయ్య

18 Nov, 2022 00:36 IST|Sakshi

సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్‌): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని కోరుతూ పార్లమెంటులో పోరాటం చేస్తానని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. కరెన్సీపై ఇప్పటికే అనేకమంది ఫొటోలను ముద్రించారని ఆర్‌బీఐ వ్యవస్థాపకుడైన అంబేడ్కర్‌ ఫొటోను మాత్రం ఎందుకు ముద్రించడంలేదని ప్రశ్నించారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి’ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమా వేశంలో ఆర్‌.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బల హీన వర్గాలకు రిజర్వేషన్లు అందించిన మహానీ యుడు అంబేడ్కర్‌ అని, కరడుగట్టిన వ్యవస్థపై పోరాడి మనకు హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి ఫొటోను కరెన్సీపై ముద్రిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

ఆయన ఫొటో ముద్రించాలనే ఆలోచన పాలకులకు లేకపోవడం దుర్మార్గమన్నారు. అంబేడ్కర్‌ అందరి వాడని ఆయనను ఒక్క కులానికే పరిమితం చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పోకల కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు