రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన ఏకైక గ్రామం

10 Dec, 2020 08:25 IST|Sakshi
ముఖరా(కే) గ్రామంలోని పల్లె ప్రకృతి వనం

జిల్లా స్పెషల్‌- ఆదిలాబాద్‌

సాక్షి, ఆదిలాబాద్‌ : ‘నిన్నటి వరకు నేను ఎక్కడికి వెళ్లినా వరంగల్‌ జిల్లా గంగాదేవిపల్లి.. నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గురించి చెప్పేవాడిని. ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామం పేరు తలుస్తా.. గ్రామాలు ఎలా ఉండాలో చూసి రమ్మని అధికారులు, సర్పంచులకు చెబుతా..’’ఇది స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖరా(కే) గ్రామ సర్పంచ్‌ గాడ్గే మీనాక్షితో అన్నమాటలివి. నిజంగా సీఎం మాటలకు అనుగుణంగా అక్కడ అభివృద్ధి జరిగిందా? ఆ గ్రామం కేసీఆర్‌ దృష్టిని ఎలా ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఎందుకు ఎంపికైంది? ముఖరా(కే) గ్రామం అభివృద్ధిపై ప్రత్యేక కథనం. చదవండి: సిద్దిపేటలో సామూహిక గృహ ప్రవేశాలు

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామంలో 300 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 700 మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత కనిపిస్తాయి. తడిచెత్త, పొడిచెత్త సేకరణ ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. సాధారణంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తయితే ఓడీఎఫ్‌గా పరిగణిస్తారు. వీటితోపాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తిస్తూ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన ఏకైక పంచాయతీ ముఖరా(కే) కావడం గమనార్హం. ప్రభుత్వ పథకాలను వంద శాతం ఉపయోగించుకుంటూ ఈ గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తోంది. నూతన పంచాయతీగా ఏర్పడినప్పటికీ అభివృద్ధిలో ముందంజలో ఉంది. నవంబర్‌ 19న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ముఖరా(కే) సర్పంచ్‌ గాడ్గే మీనాక్షితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణాలు, సామూహిక మరుగుదొడ్లు వంటి పథకాలను వందశాతం అమలు చేయడంపై ఆయన సర్పంచ్‌ను అభినందించారు. గ్రామంలో ప్రకృతి వనం చూడముచ్చటగా ఉంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్పంచ్, ఆమె భర్త, ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమలు చేస్తున్నారు. నర్సరీ, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, వైకుంఠధామం నిర్మించారు. మియావాకీ విధానంలో దట్టమైన అడవులు పెంచాలని ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ గ్రామంలో పంచాయతీ స్థలంలో 19 వేల మొక్కలు నాటి పెంచుతున్నారు. 

ఆనందంగా ఉంది 
బహిరంగ మల, మూత్ర విసర్జనతో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది. మహిళ సర్పంచ్‌గా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం కోసం గ్రామస్తులకు అవగాహన కల్పించా. ఫలితంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం సాధ్యమైంది. ముఖరా పంచాయతీకి జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం మహిళా సర్పంచ్‌గా చాలా గర్వంగా.. ఆనందంగా ఉంది. గ్రామాభివృద్ధి కమిటీకి సంబంధించి మా దగ్గర రూ.కోటికి పైగా నిధులు ఉన్నాయి. ఈ నిధులపై వచ్చే వడ్డీతో ప్రభుత్వ పథకాల అమలుకు కొంత ఉపయోగించుకొని బిల్లులు వచ్చిన తర్వాత మళ్లీ వీడీసీకి తిరిగి ఇస్తున్నాం.
– గాడ్గే మీనాక్షి, ముఖరా(కే) సర్పంచ్‌

మరిన్ని వార్తలు